పనామా పేపర్స్ లీక్ కేసులో బచ్చన్ కుటుంబానికి కష్టాలు పెరిగాయి. ఈ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌కి ఈడీ సమన్లు పంపింది. పనామా పేపర్ లీక్ కేసులో ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆమె సోమవారం (డిసెంబర్ 20) రోజున ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ముందు ఫెమా కేసులో విచారణ నిమిత్తం హాజరు కావాలని అందులో కోరింది. ముందుగా సెక్షన్ 37 ఫెమా కింద 2021 నవంబర్ 9న ఐశ్వర్యరాయ్‌కి ఈడీ సమన్లు పంపింది. ఈ విషయంలో ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (PMLA) కింద మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఈ రోజు తన కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా ఏజెన్సీ నటిని కోరింది. ఈరోజే ఐష్ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా, ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరు కావడానికి మరో తేదీని కేటాయించాల్సిందిగా అధికారులను కోరినట్టు తెలుస్తోంది.
పనామా పేపర్ల కేసు విచారణ చాలా కాలంగా సాగుతోంది. ఈడీ అధికారులు దేశంలోని పలువురు ప్రముఖులను విచారణలో చేర్చారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం అభిషేక్ బచ్చన్ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కొన్ని పత్రాలను కూడా ఈడీ అధికారులకు అందజేశారు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్‌కి ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పనామా పేపర్ల లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లోని హెచ్‌ఐయూ దీనిపై విచారణ జరుపుతోంది. నిజానికి పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి దాదాపు 500 మంది ప్రమేయం ఉంది. వీటిలో దేశ నాయకులు, సినీ నటులు, క్రీడాకారులు, వ్యాపారులు, ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరంతా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏజెన్సీ ఇప్పుడు తన పని తాను చేసుకుంటూ పోతోంది.
ఈ కేసు విచారణలో భాగంగా నటుడు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఆర్‌బిఐకి చెందిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద 2004 నుండి విదేశీ రెమిటెన్స్‌లపై వివరణ ఇవ్వాలని కోరుతూ బచ్చన్ కుటుంబానికి కొంతకాలం క్రితం నోటీసులు జారీ చేసినట్లు మనీలాండరింగ్ నిరోధక ఏజెన్సీలోని అధికారులు తెలిపారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ త్వరలోనే వారిని విచారణకు పిలిపించే అవకాశం ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ ఆఫ్‌షోర్ రెమిటెన్స్‌లపై పన్నుల అధికారి విచారణ జరుపుతున్నారు. పనామా పేపర్స్‌గా పేర్కొనబడిన పనామాకు చెందిన న్యాయ సంస్థ మొసాక్ ఫోన్సెకా నుండి ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రికార్డుల నిల్వపై జరిపిన దర్యాప్తులో విదేశాల్లోని ఆఫ్‌షోర్ కంపెనీలలో డబ్బును దాచిపెట్టిన అనేక మంది ప్రపంచ నాయకులు, ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి.
పనామా పేపర్స్ లీక్… అందులో బచ్చన్ ఫ్యామిలీ
2016లో పనామాకు చెందిన ఓ న్యాయ సంస్థకు చెందిన 11.5 కోట్ల పన్నుకు సంబంధించిన పత్రాలు యూకేలో లీక్ అయ్యాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు, వ్యాపారులు, ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. భారతదేశం నుంచి సుమారు 500 మంది పేర్లు ఇందులో ఉన్నట్టు వెల్లడించారు. ఇందులో బచ్చన్ కుటుంబం పేరు కూడా ఉంది. సమాచారం ప్రకారం అమితాబ్ బచ్చన్ 4 కంపెనీలకు డైరెక్టర్‌గా చేశారు. వీటిలో మూడు బహామాస్‌లో ఉండగా, ఒకటి వర్జిన్ దీవులలో ఉంది. ఇవి 1993లో స్టార్ట్ అయ్యాయి. ఈ కంపెనీల మూలధనం 5 వేల నుంచి 50 వేల డాలర్లు ఉండగా, ఈ కంపెనీలు కోట్ల విలువైన ఓడల వ్యాపారం చేస్తున్నాయి.
ఇక ఐశ్వర్య గతంలో ఓ కంపెనీకి డైరెక్టర్‌గా చేసింది. తరువాత ఆమెను కంపెనీ వాటాదారుగా ప్రకటించారు. కంపెనీ పేరు అమిక్ పార్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని ప్రధాన కార్యాలయం వర్జిన్ ఐలాండ్స్‌లో ఉంది. ఐశ్వర్యతో పాటు ఆమె తండ్రి కె. రాయ్, తల్లి బృందా రాయ్, సోదరుడు ఆదిత్య రాయ్ కూడా కంపెనీలో భాగస్వాములు. ఈ సంస్థ 2005లో ఏర్పడింది. మూడేళ్ల తర్వాత అంటే 2008లో కంపెనీ మూతపడింది.