Site icon NTV Telugu

Dulquer Salmaan : దుల్కర్ తెలుగువాడే!

Mamooty

Mamooty

Dulquer is Telugu!
యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ మన తెలుగువాడే! ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ అని అందరికీ తెలుసు. మరి ఈ తెలుగుబంధం ఏమిటి అంటారా? మరదే… అసలు విషయం! దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘సీతారామం’ సినిమా నిర్మించింది. తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాత తీసిన తెలుగు చిత్రంలో మళయాళ హీరో దుల్కర్ అవసరమా అంటూ యంగ్ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మాళవిక నాయర్ తో కామెంట్ చేశాడు. అది విని, యాంకర్ సుమ అతనికి ఓ ఛాలెంజ్ విసిరింది. అదేమిటంటే, తెలుగు సినిమా రంగానికి చెందిన కొన్ని ప్రశ్నలను దుల్కర్ ను అడగాలి, వాటికి అతను సరైన సమాధానాలు చెప్పకపోతే అతను తెలుగువాడు కానట్టే! చెబితే… తెలుగువాడేనని ఒప్పేసుకోవాలి.

మొదటి ప్రశ్నగా “మమ్ముట్టిగారు నటించిన తొలి తెలుగు చిత్రమేది?” అనగానే “స్వాతికిరణం” అని సమాధానమిచ్చాడు దుల్కర్. తరువాత ‘మహానటి’ డైరెక్టర్ నాగ అశ్విన్ వైజయంతీ మూవీస్ కు వినిపించిన తొలి కథ ఏది అన్నది ప్రశ్న. దానికి “ఎవడే సుబ్రహ్మణ్యం” అన్నది దుల్కర్ జవాబు. రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి చిత్రమేది? అన్నది ఆ పై అడిగిన ప్రశ్న. దీనికి “స్టూడెంట్ నంబర్ వన్” అని కాసేపు ఆలోచించి, మరీ చెప్పాడు దుల్కర్. అశ్వనీదత్ గారికి వైజయంతీ బ్యానర్ టైటిల్ సూచించినది ఎవరు? అన్నది ఆఖరి ప్రశ్న. అందుకు తడుముకోకుండా “యన్టీఆర్ గారు” అని సమాధానమిచ్చాడు దుల్కర్. నిజంగా చివరి ప్రశ్నకు తనకే సమాధానం తెలియదని, దానిని కూడా దుల్కర్ చెప్పడం విశేషమని యాంకర్ సుమ తెలిపింది. చివరకు తన కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటూ, ‘దుల్కర్ ను తెలుగువాడి’గా అంగీకరించడం సంతోష్ వంతయింది.

Exit mobile version