కథల ఎంపికలో మేటి… దుక్కిపాటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత గొప్ప మేధావులైనా, జనం నాడి పట్టక పోతే లాభం లేదు – అంటారు. అసలు జనం నాడిని పట్టుకోవడమే పెద్ద విద్య! సదరు విద్యలో ఆరితేరిన వారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారే వరుస విజయాలు చూస్తారు. అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు అలాంటివారే! ఆయన దూరదృష్టి కారణంగానే, అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు అనిపించుకోగలిగారు. దుక్కిపాటి తమ ‘అన్నపూర్ణ’ పతాకంపై జనం మెచ్చే చిత్రాలు తెరకెక్కించి పదికాలాల పాటు జనం మదిలో నిలచిపోయారు. ‘తన ప్రతి విజయం వెనుక ఉన్నది దుక్కిపాటి వారి మేధాశక్తి’ అని అక్కినేని పలుమార్లు చెప్పుకున్నారు. దుక్కిపాటి నెలకొల్పిన ‘ఎక్సెల్సియర్ నాటక సమితి’లోనే తొలుత అక్కినేని వేషాలు వేశారు. ఆయన ప్రోత్సాహంతోనే చిత్రసీమలో అడుగు పెట్టారు. ఘంటసాల బలరామయ్యను ఆకట్టుకోగలిగారు. తరువాత తెలుగు చిత్రసీమలో మేటి హీరోగా వెలిగిపోయారు.
తొలి చిత్రంతోనే విజయం!
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా విజయాలు సాధిస్తున్నా, ఆయనను వైవిధ్యమైన పాత్రలు పలకరించడం లేదని భావించారు దుక్కిపాటి మధుసూదనరావు. తన హీరో వరైటీ రోల్స్ చేయాలంటే, ముందుగా సొంత సంస్థ ఒకటి ఉండి తీరాలని దృఢంగా నిశ్చయించారు. దుక్కిపాటికి కన్నతల్లి లేకపోయినా, సవతితల్లి అన్నపూర్ణమ్మ ఎంతో బాగా చూసుకున్నారు. ఆ తల్లి పేర 1953లో దుక్కిపాటి మధుసూదనరావు ‘అన్నపూర్ణ పిక్చర్స్’ సంస్థను నెలకొల్పారు. దానికి అక్కినేని నాగేశ్వరరావును ఛైర్మన్ గా చేశారు. తాను మేనేజింగ్ డైరెక్టర్ గా అన్ని వ్యవహారాలు చూసుకొనేవారు. తొలి చిత్రంతోనే జనం మదిని గెలవాలని నిర్ణయించారు. అదే సమయంలో కేవీ రెడ్డి ‘పెద్దమనుషులు’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో సినిమా తీయాలని నిర్ణయించారు దుక్కిపాటి, అక్కినేని. అందుకోసం కొంతకాలం ఆగాలని కేవీ రెడ్డి చెప్పారు. అందుకు అన్నపూర్ణ అధినేతలూ అంగీకరించారు.
Also Read
- Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
- Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
- Jagapathi Babu: "నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో": జగపతి బాబు
- Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
‘పెద్దమనుషులు’ పూర్తయ్యాక చెప్పినట్టుగానే కేవీ రెడ్డి ‘అన్నపూర్ణ’ వారి చిత్రం అంగీకరించారు. తొలి ప్రయత్నంగా కేవీ రెడ్డి దర్శకత్వంలో దుక్కిపాటి నిర్మించిన చిత్రం ‘దొంగరాముడు’. ఈ చిత్రానికి కేవీ రెడ్డి, డి.వి.నరసరాజు, దుక్కిపాటి మధుసూదనరావు కలసి కథను తయారు చేసుకున్నారు. డి.వి.నరసరాజు మాటలు రాయగా, సముద్రాల పాటలు పలికించారు. ఏయన్నార్, సావిత్రి ప్రధాన జంట, జమున, జగ్గయ్య మరో జంట. ఆర్ .నాగేశ్వరరావు విలన్. వీరి మధ్య సాగే కథతో రూపొందిన ‘దొంగరాముడు’ 1955 అక్టోబర్ 1న విడుదలయింది. ఆ మరుసటి రోజునే అంటే అక్టోబర్ 2నే గాంధీ జయంతి. దీనిని దృష్టిలో ఉంచుకొనే, ఇందులో గాంధీజీపై సాగే, “భలే తాత మన బాపూజీ…” అనే పాటను చొప్పించారు. దీనిని బట్టే, కేవీ రెడ్డి, దుక్కిపాటి ఎంత పకడ్బందీగా చిత్రాన్ని తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. ‘దొంగరాముడు’ చిత్రం ఘనవిజయం సాధించింది.
అన్నపూర్ణలో ఆదుర్తి…
దుక్కిపాటి ఆ రోజుల్లోనే బి.ఏ., చదివారు. ఆయనకు సాహిత్యమంటే ఎంతో అభిమానం. అన్ని భాషల సాహిత్యాన్ని చక్కగా చదివేవారు. బెంగాలీ కథలంటే ఆయనకు ఎంతో ఆసక్తి. వాటిని తెలుగులో సినిమాలుగా రూపొందించాలని తపించేవారు. తనకు నచ్చిన కథలను, జనం మెచ్చేలా ఎలా మలచాలో యోచించేవారు. ‘దొంగరాముడు’ విజయం సాధించగానే, మళ్ళీ కేవీ రెడ్డి దర్శకత్వంలోనే మరో సినిమా తీయాలని ఆశించారు. అయితే అప్పటికే కేవీ రెడ్డి విజయావారి ‘మాయాబజార్’ అంగీకరించారు. దాంతో వేరే దర్శకునితో సినిమా తీయమని ఆయన సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు మిత్రుల సలహా మేరకు ఆదుర్తి సుబ్బారావును దర్శకునిగా ఎంచుకున్నారు. బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రాసిన ‘దేవదాసు’ నవల ఆధారంగా రూపొందిన చిత్రంతోనే ఏయన్నార్ నటునిగా మంచి పేరు సంపాదించారు. అందువల్ల శరత్ బాబు నవల అయితే బాగుంటుందనీ భావించారు దుక్కిపాటి. శరత్ రాసిన ‘నిష్కృతి’ అనే నవల ఆధారంగా ‘తోడికోడళ్ళు’ తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొంది, మంచి విజయాన్ని మూటకట్టుకుంది. అలా తన మదిని హత్తుకున్న కథలను సినిమాలకు అనుగుణంగా మలచడంలో పట్టు సాధించారు దుక్కిపాటి.
వరుస విజయాల అన్నపూర్ణ…
‘తోడికోడళ్ళు’ విజయం తరువాత ఏయన్నార్, సావిత్రి జంటగా “మాంగల్య బలం, వెలుగునీడలు” వంటి విజయాలు చూశారు దుక్కిపాటి. ఏయన్నార్ ను ద్విపాత్రాభినయంలో చూడాలని దుక్కిపాటి ఆశించారు. అందుకోసం బెంగాలీ చిత్రం ‘తాషేర్ ఘర్’ను ఎంచుకున్నారు. దాని ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘ఇద్దరు మిత్రులు’. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఎంతసేపూ పరభాషా కథలతో చిత్రాలు తీయడమేనా? మన తెలుగు కథలు సినిమాలకు పనికిరావా? అన్న ఆలోచన కలిగింది దుక్కిపాటికి. దాంతో డాక్టర్ శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నవలను ‘చదువుకున్న అమ్మాయిలు’ పేరుతో తెరకెక్కించారు. ఆ సినిమా మునుపటి చిత్రాల స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ‘అన్నపూర్ణ’ సంస్థ చిత్రాల స్థాయిలో పాటలతో అలరించింది. ఆరికెపూడి కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘చక్రభ్రమణం’ నవలను ‘డాక్టర్ చక్రవర్తి’ పేరుతో సినిమాగా మలిచారు దుక్కిపాటి. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ‘తోడికోడళ్ళు’ మొదలు ‘డాక్టర్ చక్రవర్తి’ దాకా అన్ని చిత్రాలకూ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఆదుర్తి వద్ద అసోసియేట్ గా పనిచేసిన కె.విశ్వనాథ్ ను తమ ‘ఆత్మగౌరవం’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి. ఈ సినిమా దర్శకునిగా విశ్వనాథ్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది.
అన్నపూర్ణ సంస్థ అన్ని చిత్రాలలోనూ ఏయన్నార్ కథానాయకుడు. ఆ సంస్థ నుండి అక్కినేని సినిమా వస్తోందంటే అభిమానులు ఆనందంతో పొంగిపోయేవారు. అయితే ఎందుకనో ‘ఆత్మగౌరవం’ ఫ్యాన్స్ కు అంతకు ముందు ఉన్న కిక్ ఇవ్వలేదు. ఆ తరువాత ఏయన్నార్ సినిమాలు సైతం అంతగా అలరించలేకపోతూ వచ్చాయి. ఈ సమయంలో ఎలాగైనా ఏయన్నార్ కు ఓ సాలిడ్ హిట్ ఇవ్వాలని తపించారు దుక్కిపాటి. పలు కథలను చర్చించారు. చివరకు ముళ్ళపూడి వెంకటరమణ ‘బియాండ్ దిస్ ప్లేస్’ నవల ఆధారంగా ‘పూలరంగడు’ అనే కథను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ నవలారచయిత్రి రంగనాయకమ్మ మాటలు రాశారు. ‘పూలరంగడు’ ఊహించినట్టుగానే మంచి విజయం సాధించింది. ఏయన్నార్ కు మళ్ళీ మాస్ లో ఫాలోయింగ్ పెంచింది. సారథీ స్టూడియోస్ భాగస్వామ్యంలో యద్దనపూడి సులోచనారాణి నవల ‘ఆత్మీయులు’ను తెరకెక్కించారు. వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా మ్యూజికల్ హిట్ అనిపించుకుంది. దుక్కిపాటి తరువాత నిర్మించిన “జైవాన్, అమాయకురాలు” చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. మళ్ళీ తమకు అచ్చి వచ్చిన ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘విజేత’ నవలను ‘విచిత్రబంధం’గా నిర్మించి, ఘనవిజయం సాధించారు. ఈ సినిమా ద్వారా రామకృష్ణను గాయకునిగా పరిచయంచేశారు. ‘విజేత’ తరువాత మరో యద్దనపూడి నవల ‘బంగారు కలలు’ను అదే పేరుతో నిర్మించారు. దీనికి కూడా ఆదుర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయం సాధించినా, ‘విచిత్రబంధం’ స్థాయి చూడలేదు. ఇదే అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలో ఏయన్నార్ హీరోగా రూపొందిన చివరి చిత్రం.
దుక్కిపాటి ఆ తరువాత కూడా యద్దనపూడి నవలలు ‘ప్రేమలేఖలు, రాధాకృష్ణ’ను అవే పేర్లతో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించారు. బాపు, రమణ కాంబోలో ‘పెళ్ళీడు పిల్లలు’ తెరకెక్కించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘అమెరికా అబ్బాయి’ నిర్మించారు. ఇవేవీ ఒకప్పటి అన్నపూర్ణ పిక్చర్స్ చిత్రాల స్థాయిని అందుకోలేదు. కానీ, నిర్మాతగా దుక్కిపాటికి సంతృప్తి కలిగించాయి. తొలి సినిమా మొదలు చివరిదాకా విలువలకు ప్రాధాన్యమిస్తూ సాగిన దుక్కిపాటి మధుసూదనరావు చిత్రసీమలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో ముందుకు సాగలేకపోయారు. అయితే తెలుగు చిత్రసీమలో నవలల ఆధారంగా ఎక్కువ చిత్రాలు నిర్మించిన నిర్మాతగా దుక్కిపాటి నిలచిపోయారు. 1993లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుక్కిపాటిని రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది.
తాజావార్తలు
-
Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
-
Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్‌టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్‌పై కెప్టెన్ గిల్ రియాక్షన్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..