ఉదయ్ కిరణ్, నితిన్ లను స్టార్ హీరోలను చేసిన క్రెడిట్ దర్శకుడు తేజాకే దక్కుతుంది. అంతేకాదు… ఫిల్మ్ మేకింగ్ ను పేషన్ గా భావించే తేజ ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ మూవీస్ ను అందించారు. అందుకే స్టార్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు సైతం తన రెండో కొడుకు అభిరామ్ ను పరిచయం చేసే బాధ్యత తేజాకు అప్పగించారు. ఇదిలా ఉంటే… తాజాగా తేజ తనయుడు హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో నూటికి నూరుశాతం నిజముంది.
తేజ తన కొడుకు అమితవ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని గత కొంతకాలంగా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే నటనకు సంబంధించిన అన్ని రకాల శిక్షణలూ అమితవ్ కు ఇప్పించారు. ఇదిలా ఉంటే గత యేడాది తేజ ‘చిత్రం 1.1’ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ సమయంలో ఎన్టీయార్ బావమరిది నార్నే నితిన్ చంద్ర ఇందులో హీరోగా నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. కారణాలు ఏవైనా ఆ ప్రాజెక్ట్ సజావుగా ముందుకు సాగలేదు. ఇక ఈ యేడాది ఫిబ్రవరి మాసంలో ‘విక్రమాదిత్య’ పేరుతో తేజ దర్శకత్వంలో నల్లమలపు బుజ్జి ఓ పిరియాడికల్ లవ్ స్టోరీ తీయబోతున్నాడనే వార్త వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారానే తేజ కొడుకు అమితవ్ తెలుగువారి ముందుకు హీరోగా రాబోతున్నట్టు తెలుస్తోంది. అలానే ‘చిత్రం 1.1’ మూవీని కూడా తేజ తన కొడుకుతోనే చేస్తాడనీ అంటున్నారు. మరి తన కొడుకు డెబ్యూ మూవీకి సంబంధించిన విశేషాలను తేజా మీడియాతో ఎప్పుడు పంచుకుంటాడో చూడాలి.