ఒక సినిమా ఫినిష్ అవ్వడానికి మినిమమ్ ఆరు నెలలు పడుతుంది. ఇక పెద్ద సినిమా అయితే ఏడాది.. అంతకన్నా ఎక్కువే పడుతుంది. అన్నిరోజులు చిత్ర బృందం ఒక కుటుంబంలా కలిసి ఉంటుంది. అప్పుడప్పుడు వారిలో వారికి చిన్న చిన్న విభేదాలు రావడం సహజమే. ఆ గొడవలు కొన్నిసార్లు బయటికి వస్తాయి.. మరికొన్ని రావు. హీరో హీరోయిన్ల మధ్య గొడవ, డైరెక్టర్, హీరోకి మధ్య గొడవ, నిర్మాతకు డైరెక్టర్ కు మధ్య గొడవ అని చాలా సార్లు వింటూనే ఉంటాం. అయితే కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబుకు డైరెక్టర్ పరుశురామ్ కు మధ్య గొడవ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. వీరిద్దరి కాంబో లో ‘సర్కారువారి పాట’ చిత్రం తెరకెక్కిన సంగతి తెల్సిందే. మే 12 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న డైరెక్టర్ కు ఈ గొడవ తాలూకు ప్రశ్న ఎదురైంది. దీంతో పరుశురామ్ నోరు విప్పక తప్పలేదు. ఈ సినిమా సెట్ లో మహేష్ కు, మీకు గొడవ జరిగినట్లు వార్తలు వచ్చాయి.. వాటి గురించి మీరేమంటారు..? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ ఈ విధంగా బదులు ఇచ్చాడు.
“నాకు, మహేష్ గారికి మధ్య గొడవ జరగలేదు అని నేను చెప్పను. అలా చెప్తే నేను అబద్దం చెప్పినట్లే అవుతుంది. అవును మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కానీ అదేమంత పెద్దది కాదు. ఒక పెద్ద సినిమా తెరకెక్కుతున్నప్పుడు చిత్ర బృందం మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. కరోనా సమయంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా మీద వాయిదా పడుతూ వచ్చింది. ఒక ఏడాదిలో పూర్తి అవుతుంది అనుకున్న షూటింగ్ మూడేళ్లు పట్టింది. ఇక ఆ సమయంలో ఈ సినిమా వలన మహేష్ చాలా ప్రెషర్ పడాల్సివచ్చింది. ఆ సమయంలో నా మీద ఆయన చిరు కోపం చూపించారు. అంతే తప్ప.. ఎలాంటి సీరియస్ విభేదాలు అయితే మా మధ్య లేవు. నిజం చెప్పాలంటే కరోనా సమయంలో ఆయన నాపై చూపించిన కేర్ ను నేను ఎప్పటికి మర్చిపోలేను. మా నాన్నగారికి కరోనా వస్తే పదిసార్లు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగేవారు. ఇక ఒకసారి నా భార్యకు ఆరోగ్యం బాగోకపోతే ఆయనే స్వయంగా డాక్టర్ ను పిలిచి మరి చికిత్స చేయించారు. మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని” చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
