Naagali: 1995లో ‘తపస్సు’ సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ‘నాగలి’ మూవీలో రైతుగా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. దర్శకుడిగా పలు వైవిధ్యమైన చిత్రాలను గత మూడు దశాబ్దాలుగా తెరకెకిస్తున్నాడు భరత్ పారేపల్లి. దాసరి శిష్యుడైన భరత్ 1992లో ‘డాక్టర్ అంబేద్కర్’ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత వరుసగా ‘బాయ్ ఫ్రెండ్, జంతర్ మంతర్, తపస్సు, వీరుడు’ వంటి సినిమాలను రూపొందించాడు. దాదాపు ఇరవై సినిమాలను భరత్ దర్శకత్వం వహించినా, సూపర్ హిట్ ను మాత్రం అందుకోలేక పోయాడు. భరత్ తో దాసరి నారాయణరావు ‘మైసమ్మ ఐపీఎస్’ సినిమాను నిర్మించారు. అలానే దాసరి తనయుడు అరుణ్ తో భరత్ ‘ఆదివిష్ణు’ సినిమాను తెరకెక్కించాడు. తెలంగాణ ఉద్యమం మలిదశ ప్రారంభ దినాల్లో రియల్ స్టార్ శ్రీహరితో భరత్ ‘తెలంగాణ’ అనే సినిమాను తీశాడు.
ఇక ప్రస్తుతానికి వస్తే… రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ది డ్రీమ్స్ కంపెనీ బ్యానర్ పై పావని మొక్కరాల సమర్పణలో ‘నాగలి’ అనే సినిమాను భరత్ తెరకెక్కించాడు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ, ”రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నూతన నటీనటులతో చిత్రీకరణ జరిపాం. నూతన కథానాయకుడు సుదీప్ మొక్కరాల (నిడదవోలు), కథానాయకి అనుస్మతి సర్కార్ (ముంబాయి) హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలోని నాలుగు పాటలకు ఎం. ఎల్. రాజా స్వర రచన చేశారు. రైతుల ఆత్మహత్యలు, వాళ్ళ కతలు, వెతలు ప్రధానాంశంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును తలపించేలా ఇప్పుడు రైతాంగం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో ఓ ఛాలెంజింగ్ పాత్రను నేనే చూస్తూ, ఈ సినిమాను నిర్మించాను. జనవరిలో ఆడియో విడుదల చేసి, ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు. సత్య ప్రసాద్ రొంగల, మోహన్ రావు వల్లూరి, కావేరి, మధు బాయ్, వాసు వర్మ, నాని తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు మాటలు , పాటలు పెద్దాడ మూర్తి సమకూర్చారు.