Director Bapu: బాపు అసలు పేరు సత్తిరాజు వేంకట లక్ష్మీనారాయణ. చదివిందేమో న్యాయశాస్త్రం. కానీ, బాల్యం నుంచీ పట్టిన కుంచెతో గీసిన గీతలు, రాసిన రాతలు తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేశాయి. ఇక చిత్రసీమలో బాపు ‘తీతలు’ గిలిగింతలు పెట్టాయి, యెదను తట్టాయి, జనం మనసుల్లో గూడుకట్టుకున్నాయి. దాంతో ‘బాపు’ అన్న పేరు తెలుగువారికి మహా ఇష్టమై పోయింది. ఈ నాటికీ బాపు గీతలు, ఆయన చేతి రాతలు చూసి మురిసిపోయేవారు ఎందరో! ఇక ఆయన చిత్రాలను చూస్తూ పరవశించిపోయవారికీ తెలుగునాట కొదువే లేదు.
బాపు 1933 డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. చిన్నతనం నుంచీ బొమ్మలు బాగా గీసేవారు. బి,ఏ.బి.ఎల్.,, చదివినా, చిత్రలేఖనంపై ఆసక్తితో బాపు డ్రాయింగ్ ట్రైనింగ్ లోనూ డిప్లొమా పొందారు. బాపుకు తమిళ చిత్రకారులు గోపులు అంటే ఎంతో అభిమానం. ఆయన ‘Gopulu’ అంటూ సైన్ చేసేవారు. దానిని అనుకరిస్తూ తన పేరును ‘Bapu’గా ఇంగ్లిష్ లో సైన్ చేయడం ఆరంభించారు. కొన్నాళ్లు ‘రేఖ’ అన్న పేరుతోనూ బాపు బొమ్మలు గీశారు. అందువల్లే ‘బాపురే’ఖలు అంటూ జనం అభినందిస్తూ ఉండేవారు.
బాపు బాల్యమిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణ కథలకు, బాపు బొమ్మలు వేసి అలరించారు. అలా రమణ రాత, బాపు గీత కలసి ఆ రోజుల్లో పాఠకులను ఎంతగానో రంజింప చేశాయి. బాపుకు ఆంగ్ల చిత్రకారులు ఎడ్మండ్ డ్యులాక్ అన్నా ఎంతో అభిమానం, చైనా చిత్రకారులు హొకుసయ్ పైనా అంతే అభిమానం. ఇక మన ఆర్.కె.లక్ష్మణ్ బొమ్మలంటే ప్రాణం. ఇలా తనకు నచ్చిన చిత్రకారుల శైలిని అభ్యాసం చేస్తూ, తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు బాపు. రేఖాచిత్రాలలో బాపు లైన్ ను మించినది లేదనే పేరు సంపాదించారు.
తెలుగునాట బాపు బొమ్మల కథలు విశేషాదరణ చూరగొన్నాయి. ముళ్ళపూడి వెంకటరమణ చిత్రసీమలో రచయితగా రాణిస్తున్న సమయంలో ఆయన పనిచేసిన కొన్ని చిత్రాలకు పత్రికాప్రకటనలకు తగ్గ బొమ్మలు గీసేవారు బాపు. ‘మూగమనసులు’, ‘మనుషులు – మమతలు’, ‘బాగ్దాద్ గజదొంగ’ చిత్రాలకు ప్రచార చిత్రకారునిగా పనిచేశారు.
‘సాక్షి’ కథను రూపొందించుకున్న తరువాత స్టోరీ బోర్డ్స్ తయారు చేసి, తాను తీయబోయే సినిమాను బొమ్మల్లో చూపించేశారు బాపు. దాంతో నిర్మాతలు, ఫైనాన్సియర్స్ సంబరపడిపోయి ముందుకు వచ్చారు. అలా తొలి చిత్రం ‘సాక్షి’ని తక్కువ బడ్జెట్ లోనే ఔట్ డోర్ లో తెరకెక్కించారు. కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ సినిమాలో వారి పెళ్ళి సందర్భంగా వచ్చే పాట “అమ్మ కడుపు చల్లగా… అత్త కడుపు చల్లగా…” పాటను బాపు తెరకెక్కించిన తీరు జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. దాంతో బాపు-రమణ కథలకు సినీజనం ప్రాధాన్యమివ్వడం మొదలు పెట్టారు.
ఏయన్నార్ తో బాపు తొలి చిత్రం ‘బుద్ధిమంతుడు’. అందులో అక్కినేని అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశారు. బాపు, రమణ తొలి రంగుల చిత్రం ‘సంపూర్ణ రామాయణము’. నిడమర్తివారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీరామునిగా శోభన్ బాబు నటించారు. అందరూ సాహసం చేస్తున్నారని హెచ్చరించారు. విడుదలైన తరువాత ‘సంపూర్ణ రామాయణము’ ఘనవిజయం సాధించింది. అక్కినేనితో బాపు రెండో చిత్రం ‘అందాల రాముడు’. దాదాపు ఎనభై శాతం సినిమా ఔట్ డోర్ లోనే చిత్రీకరించారు. తెలుగులో ఓ స్టార్ తో ఎక్కువ భాగం ఔట్ డోర్ లో సినిమా తీయడం గురించి జనం భలేగా ముచ్చటించుకున్నారు. యన్టీఆర్ ‘అడవిరాముడు’ వచ్చే వరకు ఎక్కువ శాతం ఔట్ డోర్ లో షూటింగ్ జరుపుకున్న తెలుగుచిత్రంగా ‘అందాలరాముడు’ నిలచింది.
యన్టీఆర్ తో బాపు తొలి సినిమా ‘శ్రీరామాంజనేయ యుద్ధం’. అప్పటికే తెలుగునేలపై విశేషాదరణ పొందిన గబ్బిట వెంకటరావు రాసిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ నాటకంలోని మాటలు, పద్యాలనే ఇందులో ఉపయోగించుకున్నారు. అందువల్ల రమణ ఈ సినిమాకు పనిచేసినా, అందులో టైటిల్ కార్డ్స్ లో ఆయన పేరు ఉండదు. బాపు తీసిన సినిమాల్లో రమణ పేరు లేని ఏకైక చిత్రం ఇదే అని చెప్పవచ్చు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఏ స్టార్స్ లేకుండా బాపు-రమణ తెరకెక్కించిన ‘ముత్యాలముగ్గు’ స్వర్ణోత్సవం చూసింది. శ్రీధర్ కు కథానాయకునిగా పేరొచ్చింది. సంగీత బాపు బొమ్మగా జనం మదిని దోచింది. అప్పటి దాకా విలన్ గానూ, కేరెక్టర్ యాక్టర్ గానూ సాగుతున్న కృష్ణంరాజు కొన్ని చిత్రాలలో హీరోగానూ కనిపించారు. అలాంటి కృష్ణంరాజుకు బాపు ‘భక్త కన్నప్ప’ స్టార్ స్టేటస్ కల్పించింది.
బాపు, కృష్ణంరాజు కాంబోలో వచ్చిన రెండో చిత్రం ‘మనవూరి పాండవులు’. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు, మేకప్ ఛీఫ్ జయకృష్ణతో కలసి నిర్మించారు. ఈ సినిమాతోనే చిరంజీవి నటునిగా తొలి పారితోషికం అందుకున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ‘వంశవృక్షం’ సినిమాతో హిందీ నటుడు అనిల్ కపూర్ ను తెలుగులో నటింప చేశారు బాపు. నిజం చెప్పాలంటే, అనిల్ కపూర్ కు ఇదే తొలి చిత్రం. విశేషమేమిటంటే అనిల్ కపూర్ తో బాపు రూపొందించిన ‘వంశవృక్షం’ 1980 నవంబర్ 20న విడుదల కాగా, వారం రోజుల గ్యాప్ తో బాపు దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన హిందీ మనవూరి పాండవులు ‘హమ్ పాంచ్’ నవంబర్ 27న జనం ముందు నిలచింది. ‘వంశవృక్షం’ అంతగా ఆకట్టుకోలేదు. ‘హమ్ పాంచ్’తో హిందీలోనూ దర్శకునిగా బాపుకు మంచి పేరు లభించింది.
బాపు తెరకెక్కించిన ‘స్నేహం’ చిత్రంతో సాయికుమార్ హీరోగా పరిచయం అయ్యారు. అదే సినిమా ద్వారా రాజేంద్రప్రసాద్ కూడా పరిచయం కావడం విశేషం. బాపు ‘మనవూరి పాండవులు’లో అర్జునునిగా నటించిన చిరంజీవి తరువాత ఆయన దర్శకత్వంలో ‘మంత్రిగారి వియ్యంకుడు’లో హీరోగా నటించారు.
పరభాషల్లో విజయం సాధించిన పలు చిత్రాలను తెలుగులో బాపు రీమేక్ చేశారు. వాటిలో అధికభాగం అంతగా ఆకట్టుకోలేకపోయాయి. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొంది ఎంతగానో అలరించిన ‘సీతారామకళ్యాణం’ ఇతివృత్తంతోనే బాపు ‘సీతాకళ్యాణం’ రంగుల్లో రూపొందించగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. కానీ, విదేశాలలో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. అలాగే చిత్తూరు నాగయ్య నటించి, దర్శకత్వం వహించిన సంగీత ప్రధాన చిత్రం ‘త్యాగయ్య’ను బాపు , జె.వి.సోమయాజులుతో ‘త్యాగయ్య’గానే తెరకెక్కించారు. ఈ సినిమా కూడా పరాజయం పాలయింది.
బాపు పరమ శ్రీరామభక్తుడు. అందువల్ల ఆయన సినిమాల్లో రామభక్తి కూడా కనిపిస్తూ ఉంటుంది. బాపు సినిమాల్లోని పాటల్లోనో, మాటల్లోనో రామ అన్న పదం వినిపించడం పరిపాటే! బాపు కెరీర్ లో తొలి సూపర్ హిట్ ‘సంపూర్ణ రామాయణము’ కాగా, బాపు-రమణ చివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’ కావడం గమనార్హం! యన్టీఆర్ చివరి చిత్రంగా విడుదలైన ‘శ్రీనాథకవిసార్వభౌముడు’కు బాపు-రమణ పనిచేశారు. ఇక బాపు-రమణ చివరి చిత్రంగా తెరకెక్కిన ‘శ్రీరామరాజ్యం’లో యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ నటించారు. ఇలా పలు విశేషాలకు నెలవుగా నిలచిన బాపు-రమణ తెలుగువారి మదిలో గూడుకట్టుకోకుండా ఉంటారా!?