బాలీవుడ్ సీనియర్ నటుడు, లెజెండ్రీ స్టార్ దిలీప్ కుమార్ స్వగృహం త్వరలో మ్యూజియంగా మారనుంది. అయితే, ఆ ఇల్లు ఇండియాలో లేదు. పాకిస్తాన్ లో ఉంది. స్వాతంత్ర్యానికి ముందు అఖండ భారతంలో పెషావర్ నగరం కూడా భాగం. అందులోని ప్రఖ్యాత ‘క్విస్సా ఖవానీ జజార్’లో దిలీప్ కుమార్ ఇల్లు ఉంది. అక్కడే ఆయన 1922, డిసెంబర్ 11న జన్మించాడు. తరువాత 1940లో పూణాకి వచ్చి కాల క్రమంలో ఆనాటి బాంబే నగరం చేరుకున్నాడు. 1947లో భారత్ రెండుగా ముక్కలై పాకిస్తాన్ ఏర్పడ్డాక దిలీప్ కుమార్ తిరిగి పెషావర్ వెళ్లలేదు. అలా ఆయన జన్మించిన తన స్వంత ఇల్లు అక్కడే మిగిలిపోయింది. దిలీప్ కుమార్ అలియాస్ మహ్మద్ యూసుఫ్ ఖాన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగాడు!
పెషావర్ లోని దిలీప్ కుమార్ ఇల్లు అతడి తండ్రి, తాతల కాలం నాటిది. అటువంటి పురాతన కట్టడం ఇప్పుడు పెషావర్ స్థానిక ప్రభుత్వం నియంత్రణలోనికి రానుందట. ఆ భవనం ఇంత కాలం ఎవరి వద్ద అయితే ఉందో అతడితో చాలా కాలంగా చర్చలు జరిపిన ప్రభుత్వ అధికారులు ఎట్టకేలకు చారిత్రక కట్టడాన్ని వశం చేసుకున్నారు. త్వరలో మ్యూజియంగా మార్చనున్నారు. ఈ విషయాన్ని దిలీప్ కుమార్ భార్య సైరా భాను కూడా ధృవీకరించారు. తన భర్త యూసుఫ్ సాహెబ్ (దిలీప్ కుమార్) వారసత్వ ఆస్తిని పెషావర్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాల తరువాత స్వంతం చేసుకోవటం అనందం కలిగించిందని ఆమె అన్నారు. మ్యూజియంగా మార్చి చిరస్మరణీయం చేయటం శుభ పరిణామం అన్నారు. అయితే, ఇంత వరకూ పాకిస్తాన్ తరుఫు నుంచీ దిలీప్ కుమార్ కుటుంబానికి ఎటువంటి ఆహ్వానం, అభ్యర్థన వంటివైతే రాలేదట. దిలీప్ కుమార్ తాలూకూ వస్తువులు ఏవైనా ఇవ్వమని పాకిస్తాన్ కోరలేదట. చూడాలి మరి, ఎప్పుడూ తన ఉగ్రవాద చర్యలతో భారత్ పై కుట్రలు చేసే పక్క దేశం దిలీప్ కుమార్ మ్యూజియం విషయంలో ముందు ముందు ఎలాంటి ప్రవర్తన ప్రదర్శిస్తుందో!