హీరో కిరణ్ అబ్బవరంకు మొదటి నుండి నటనతో పాటు ప్రొడక్షన్ వర్క్ చూసుకోవడమూ అలవాటే. ‘రాజావారు రాణిగారు, ఎస్. ఆర్. కళ్యాణ మండపం’తో పాటు ఈ యేడాది విడుదలైన ‘సబాస్టియన్, సమ్మతమే’ చిత్రాలలోనూ అతని ఇన్వాల్వ్ మెంట్ ఉంది. తాజాగా శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తనయ దివ్య దీప్తి నిర్మించిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’లో కిరణ్ అబ్బవరం హీరోగా నటించాడు. ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దీనికి దర్శకత్వం వహించారు. ఈ కథ డిమాండ్ మేరకు తానే ఈ మూవీకి డైలాగ్ వర్షన్ రాశానని కిరణ్ అబ్బవరం తెలిపాడు. ఈ నెల 16న మూవీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా మీడియాలో మాట్లాడుతూ, ”కోడి రామకృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో పనిచేసే ఛాన్స్ దక్కలేదు. వాళ్ల అమ్మాయి మూవీలో హీరోగా నటించడం ఆనందంగా అనిపించింది. ఇందులో తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. మొదటిసారి నేను రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను చేశాను. ఇక సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారి పాత్ర కూడా అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.
‘ ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ సక్సెస్ అయిన తర్వాత తనతో, శ్రీధర్ గాదెతో మూవీ చేయడానికి కొంతమంది ప్రయత్నించారని, కానీ ఊహించని విధంగా ఆ అవకాశం దివ్య దీప్తికి లభించింద’ని కిరణ్ అబ్బవరం చెప్పాడు. ఈ చిత్రానికి మణిశర్మ చక్కని ట్యూన్స్ తో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారని తెలిపాడు. ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ తో పాటు అన్ని వర్గాలను అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయని కిరణ్ అన్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న ‘మీటర్’ సినిమాల షూటింగ్ పూర్తయ్యిందని, ఎ. ఎం.రత్నం బ్యానర్ లో చేస్తున్న ‘రూల్స్ రంజన్’ మూవీ నలభై శాతం షూటింగ్ పూర్తయ్యిందని చెప్పాడు. అలానే శ్రీధర్ గాదె దర్శకత్వంలోనే మరో సినిమా చేసే ఛాన్స్ ఉందని అన్నాడు. కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న తొలి చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.