Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..

  • నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వీక్షణల నాన్-ఇంగ్లీష్ మూవీ
  • 37 మిలియన్ వ్యూస్‌తో గ్లోబల్ సంచలనం
  • 22 దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో 'ధురంధర్'
  • భారతీయ కంటెంట్‌కు పెరుగుతున్న ప్రపంచ ఆదరణ
Dhurandhar

Dhurandhar

Dhurandhar : బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలు (వ్యూస్) సాధించిన నాన్-ఇంగ్లీష్ సినిమాగా ఈ చిత్రం చారిత్రాత్మక రికార్డు నమోదు చేసింది. ఈ విషయాన్ని ‘ఎక్స్‌ప్రెస్ అడ్డా’ వేదికగా నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో టెడ్ సరాండోస్ అధికారికంగా వెల్లడించారు.

గ్లోబల్ చార్ట్స్‌లో టాప్.. వ్యూస్‌తో సంచలనం

ఈ ఏడాది అమెరికా, యూకే సినిమాల తర్వాత అంతర్జాతీయంగా అత్యధికంగా వీక్షించిన చిత్రంగా ‘ధురంధర్’ నిలిచిందని టెడ్ సరాండోస్ కొనియాడారు. గణాంకాల ప్రకారం 2026 జనవరి నుండి జూన్ మధ్య కాలంలోనే ఈ సినిమా ఏకంగా 3.7 కోట్ల (37 మిలియన్లు) వీక్షణలను సొంతం చేసుకుంది. అంతంత మాత్రమే కాకుండా, ఏకకాలంలో ఏకంగా 22 దేశాలలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానంలో నిలిచి భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది.

రూ. 3,100 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర

సంచలన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీ, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డులు తిరగరాసింది. 2025 డిసెంబర్‌లో వచ్చిన మొదటి భాగం ఊహించని విజయాన్ని అందుకోగా, ఈ ఏడాది మార్చిలో విడుదలైన సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ భారత్‌లోనే ఏకంగా రూ. 1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

అంతర్జాతీయంగా పెరుగుతున్న భారతీయ కంటెంట్ క్రేజ్

ప్రపంచవ్యాప్తంగా భారతీయ కంటెంట్‌కు ఆదరణ విపరీతంగా పెరుగుతోందని ఈ సందర్భంగా టెడ్ సరాండోస్ హర్షం వ్యక్తం చేశారు. 2024 నుంచి ప్రతీ వారం ఏదో ఒక భారతీయ చిత్రం లేదా సిరీస్ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 జాబితాలో నిలుస్తూ వస్తోందని ఆయన గుర్తుచేశారు. ‘స్క్విడ్ గేమ్’ లేదా ‘మనీ హీస్ట్’ లాంటి గ్లోబల్ హిట్స్ భారత్ నుంచి ఎప్పుడు వస్తాయని చాలామంది ప్రశ్నిస్తుంటారని, కానీ భారతీయ సినిమాలు ఇప్పటికే ఆ స్థాయి ఘనతను నిరూపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.