తమిళ స్టార్ హీరో ధనుష్ ఎప్పుడూ కొత్త తరహా కథలు, కొత్త దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చూపించాడు. ఇప్పుడు మరో టాలెంటెడ్ టాలీవుడ్ దర్శకుడు వేణు ఊడుగులతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీ టాక్.
Also Read : SIIMA 2025: దేవి శ్రీ ప్రసాద్‌కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రేర్ కంప్లిమెంట్..
2018లో వచ్చిన నీదీ నాదీ ఒకే కథతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఊడుగుల, రియలిస్టిక్ కథనంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 2022 లో వచ్చిన విరాట పర్వం విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. అప్పటి నుంచి కొత్త సినిమా ప్రకటించని వేణు ఊడుగుల.. ఎట్టకేలకు తన మూడో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. కోలివుడ్ స్టార్ హీరో ధనుష్‌కు కథ చెప్పగా ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఈ ప్రాజెక్ట్‌ని యూవీ క్రియేషన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతుందని టాక్ వినిపిస్తోంది. అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడిగా మూడో సినిమా కోసం గ్యాప్ తీసుకున్న వేణు ఊడుగుల.. ఈ మధ్యలో నిర్మాతగా కూడా ప్రయోగం చేశాడు. ఈటీవీ విన్‌తో కలిసి రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమాని నిర్మిస్తున్నాడు. కాగా ధనుష్ – వేణు ఊడుగుల కాంబినేషన్ కొత్తగా ఏమి చూపిస్తుందో, ఎలాంటి కథతో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ కాంబోపై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన వెలువడితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ ఖాయం.