కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి సోషల్ మీడియాలో ఏ చిన్న వీడియో కనిపించినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. అయితే, సరిగ్గా ఏడాది క్రితం ధనుష్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట పెను దుమారమే రేపింది. ఆ వీడియో చూసిన చాలామంది ధనుష్‌కు విపరీతమైన తలపొగరు, అహంకారం అంటూ తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. తాజాగా తన కొత్త సినిమా ‘ఓం’ ప్రమోషన్ వేదికపై ఆ వివాదానికి ధనుష్ పూర్తిస్థాయిలో చెక్ పెట్టారు. గతేడాది ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘తేరే ఇష్క్ మే’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ప్రమోషన్ల కోసం ధనుష్ ముంబై వెళ్లినప్పుడు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ధనుష్ నడుచుకుంటూ వెళ్తుండగా, అతని ప్యాంటు వెనుక భాగం సరిగ్గా లేకపోవడంతో స్టైలిస్ట్ కావ్య శ్రీరామ్ పరిగెత్తుకుంటూ వచ్చి బహిరంగంగానే దాన్ని సరిచేశారు. అయితే, ధనుష్ ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా తన దారిన తాను వెళ్లిపోయారు. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు ధనుష్‌పై విరుచుకుపడ్డారు. ఒక అమ్మాయి అంత కష్టపడి ప్యాంటు సరిచేస్తుంటే కనీసం థ్యాంక్స్ చెప్పకపోగా, అసలు ఆమెను పట్టించుకోకపోవడం ఏంటని, స్టార్ డమ్ తలకెక్కిందని రకరకాలుగా విమర్శించారు.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘ఓం’ మరికొద్ది రోజుల్లో (నవంబర్ 20న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకకు స్టైలిస్ట్ కావ్య శ్రీరామ్ కూడా హాజరయ్యారు. ఈ వేదికపై ధనుష్ ఆ పాత వీడియో వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టారు. ధనుష్ మాట్లాడుతూ.. “కావ్య శ్రీరామ్ నా స్టైలిస్ట్. తన పని పట్ల ఆమెకు ఉండే అంకితభావం అద్భుతం. గతేడాది ‘తేరే ఇష్క్ మే’ ప్రమోషన్స్ సమయంలో నా ప్యాంటు వెనుక భాగం కొంచెం ఇబ్బందిగా ఉండటాన్ని గమనించిన కావ్య, చుట్టూ ఉన్న జనాన్ని కూడా పట్టించుకోకుండా వెంటనే వచ్చి సరిచేసింది. కానీ ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న పాటకు తగ్గట్టుగా నేను నడుస్తుండటంతో, వెనుక ఆమె ఏం చేస్తుందో నాకు అసలు తెలియలేదు. కానీ ఆ వీడియో చూసి నాకు చాలా అహంకారం అంటూ అందరూ నన్ను తిట్టారు. ఆమె కష్టానికి నా ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇదే వేదికపై మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ధనుష్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. 43 ఏళ్ల ధనుష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో తెల్ల గడ్డంతో కనిపిస్తుండగా, 75 ఏళ్ల మమ్ముట్టి మాత్రం ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేకుండా ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నారు. దీంతో మమ్ముట్టి పక్కన ధనుష్ అన్నయ్యలా కనిపిస్తున్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ధనుష్.. “మమ్ముట్టి గారూ, నాదొక చిన్న విన్నపం. వచ్చేసారి ఈవెంట్‌కు వచ్చేటప్పుడు మీ గడ్డంలో కనీసం కొన్ని తెల్ల వెంట్రుకలైనా ఉండేలా చూసుకోండి. లేదంటే మీ పక్కన నేను మరీ పెద్దవాడిలా కనిపిస్తున్నాను” అని సరదాగా అనడంతో మమ్ముట్టితో పాటు ఆడిటోరియం మొత్తం నవ్వులతో నిండిపోయింది.

