Devara: ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సస్పెన్స్‌కు తెర.. బడా ఛానెల్స్‌కు షాక్

Devara Satellite Rights Shocks

Devara Satellite Rights Shocks

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో వందల కోట్ల వసూళ్లు రాబట్టడమే కాకుండా, ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్ అందుకుంది. అయితే, సినిమా రిలీజ్ అయి ఇంతకాలం గడుస్తున్నా తెలుగులో మాత్రం ఈ చిత్రం ఇప్పటివరకు బుల్లితెరపై ప్రసారం కాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక స్టార్ హీరో బ్లాక్‌బస్టర్ సినిమా శాటిలైట్ హక్కులు ఇన్నాళ్లు హోల్డ్‌లో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్‌కు ఇప్పుడు తెరపడినట్లు ఫిల్మ్ నగర్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్‌లోని దిగ్గజ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లు ‘దేవర’ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయనే ప్రచారం జరిగినా, అనూహ్యంగా కొత్త ప్లేయర్ రంగంలోకి దిగి అందరికీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టబోతున్న ‘సోనీ తెలుగు’ (Sony Telugu) ఛానెల్ ఈ భారీ చిత్రం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

నిజానికి, కొత్తగా ప్రారంభం కాబోతున్న ఒక ఎంటర్టైన్మెంట్ ఛానెల్ నేరుగా ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరో సినిమాతో లాంచ్ అవ్వాలని ప్లాన్ చేయడం టెలివిజన్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు తెలుగు శాటిలైట్ మార్కెట్‌ను శాసిస్తున్న పాత ఛానెళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకే సోనీ యాజమాన్యం ఈ రేంజ్ డీల్ కుదుర్చుకున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ నిబంధనల కారణంగా ఆలస్యమైన ‘దేవర’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కొత్త ఛానెల్‌లోకి ఈ సినిమా రాబోతుండటంతో, ప్రారంభోత్సవ వేళ టీఆర్పీ రేటింగ్స్‌లో ఎలాంటి రికార్డులు నమోదవుతాయో చూడాలి. త్వరలోనే ఈ డీల్‌పై, ఛానెల్ లాంచ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.