Desam Kosam Bhagat Singh: గతంలో ”అన్నల రాజ్యం, నాగమనాయుడు, రాఘవేంద్ర మహత్యం” లాంటి చిత్రాలను నిర్మించిన రవీంద్ర గోపాల తాజాగా ‘దేశం కోసం భగత్ సింగ్’ సినిమా తీశారు. ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని పాటలను మంగళవారం ఫిలించాంబర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ”అల్లూరి సీతారామ రాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్… ఇలా స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలంటే అన్న ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు. అలాంటిది రవీంద్ర గోపాల్ సాహసం చేసి ఈ సినిమాలో ఏకంగా 14 మంది స్వాతంత్ర్య సమర యోధుల పాత్రలు వేశాడు. తన మీద తనకు ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. తన కోసం కాదు.. ఇది దేశంకోసం చేసిన సినిమా” అని అన్నారు.
ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, ”డబ్బు కోసమే సినిమా తీసే ఈ కాలంలో దేశం కోసం సినిమా చేయడం అభినందిదగ్గ విషయం. నేటి తరానికి గాంధీ, భగత్ సింగ్ అంటే ఎవరో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తే ఎంతో మంది త్యాగఫలం – మన స్వాతంత్ర్యం అనే విషయం వారికి తెలుస్తుంది” అని చెప్పారు. మూడున్నర దశాబ్దాలుగా తనకు రవీంద్ర గోపాలతో పరిచయం ఉందని, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా, ప్రొడ్యూసర్ గా ఆయనకు ఎంతో అనుభవం ఉందని, దేశభక్తి ఉట్టిపడేలా ఇందులో పాటలు ఉన్నాయని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు.
Read Also: Undavalli Arunkumar: ప్రతిపక్షాల నోరు మూయించేందుకు జీవో నెంబర్1
చిత్ర దర్శకనిర్మాత, నటుడు రవీంద్ర గోపాల మాట్లాడుతూ, ”ఒక మంచి సినిమా చేయాలన్న కసితో చేసిన చిత్రమిది. ఇటీవల మా మూవీ ట్రైలర్ ను ‘దిల్’ రాజు ఆవిష్కరించి, మమ్మల్ని ఆశీర్వదించారు. సినిమాను ఫిబ్రవరి 3న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పారు. సంగీత దర్శకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ…”ఇందులో 7 పాటలున్నాయి. ప్రతి పాటను నాతో అద్భుతంగా చేయించిన రవీంద్ర గారికి ధన్యవాదాలు” అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మోహన్ వడ్లపట్ల, బాబ్జీ, ప్రమోద్ శర్మ, బల్లెపల్లి మోహన్, ఘంటాడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.