ఆ రోజుల్లో డాన్స్ మాస్టర్ సలీమ్ పేరు తెరపై కనిపించగానే థియేటర్లలో ఈలలు మారుమోగి పోయేవి. తెలుగువాడు కాకపోయినా సలీమ్ తెలుగు చిత్రసీమలోని అగ్రశ్రేణి కథానాయకులందరికీ నృత్యరీతులు సమకూర్చి అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300 పైచిలుకు చిత్రాలకు సలీమ్ డాన్స్ కంపోజ్ చేశారు. మళయాళ సీమలో కన్ను తెరచిన సలీమ్ బాల్యం నుంచీ పచ్చని పొలాల మధ్య చిందులు వేస్తూ గడిపాడు. అతని డాన్సుల్లో ఈజ్ ను గమనించిన కొందరు స్థానికులు చిత్రసీమకు వెళ్ళి ఎవరి దగ్గరనైనా అసిస్టెంట్ గా పనిచేయమని సలహా ఇచ్చారు. దాంతో చెన్నపట్టణం చేరిన సలీమ్, నాటి మేటి నృత్య దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేశారు. పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి చినసత్యం వద్ద శాస్త్రీయ నృత్యంలో మెలకువలు తెలుసుకున్నారు సలీమ్. ఆ తరువాత తంగప్పన్, హీరాలాల్ వంటి నృత్య దర్శకుల వద్ద పనిచేశారు. 1965లో ఎమ్జీఆర్ హీరోగా రూపొందిన ‘పోర్ సిలై’ చిత్రం ద్వారా సలీమ్ సోలోగా డాన్స్ కొరియోగ్రాఫర్ కాగలిగారు. ఆ తరువాత నుంచీ ఎమ్జీఆర్ ప్రోత్సాహంతో పలు చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశారు.
తెలుగులో యన్టీఆర్ హీరోగా పీతాంబరం ‘అన్నదమ్ముల అనుబంధం’ నిర్మించారు. ఆ చిత్రానికి సలీమ్ నృత్యరీతులు సమకూర్చారు. ఆ చిత్రంలోని “ఐ లవ్ యూ సోనీ…” పాటలో సలీమ్ కనిపిస్తారు కూడా. ఆ తరువాత యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలకు సలీమ్ నృత్యరీతులు సమకూర్చారు. ముఖ్యంగా ‘అడవిరాముడు’లో “ఆరేసుకోబోయి పారేసుకున్నాను…” పాటలో యన్టీఆర్ ఇమేజ్ ను, పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని సలీమ్ డాన్స్ కంపోజ్ చేయించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. యన్టీఆర్ ‘వేటగాడు’ లోనూ సలీమ్ ఆరంభంలోనే కనిపిస్తారు. “కొండమీన చందమామ…” పాటలో నర్తించేది సలీమ్ మాస్టరే! యన్టీఆర్ సూపర్ హిట్ మూవీస్ అడవిరాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి
వంటి చిత్రాలలోని హిట్ సాంగ్స్ అన్నీ కూడా సలీమ్ డాన్స్ తో కంపోజ్ అయినవే! ఇక ఏయన్నార్ ఆల్ టైమ్ హిట్ ప్రేమాభిషేకం
లోని పాటల్లోనూ సలీమ్ మాస్టర్ డైరెక్షన్ కనిపిస్తుంది.
యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, మురళీమోహన్ వంటి హీరోలందరికీ వారి బాడీ లాంగ్వేజ్ ను బట్టి స్టెప్స్ వేయించి మురిపించారు సలీమ్. ఇక ‘అన్నదమ్ముల అనుబంధం’లోనే బాలకృష్ణతో డాన్స్ చేయించిన సలీమ్ మాస్టర్ వద్దే బాలయ్య చిత్రసీమలో అడుగుపెట్టే సమయంలో నృత్య భంగిమలను అభ్యాసం చేశారు. ఆ తరువాత అనేక చిత్రాలలో బాలయ్యకు సలీమ్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. చిరంజీవిని స్టార్ గా నిలిపిన ‘ఖైదీ’లో కూడా సలీమ్ మాస్టర్ పనితనంతోనే అందులోని పాటలు జనానికి నయనానందం పంచాయి. ఇలా నాలుగు తరాల హీరోలకు నృత్యరీతులు సమకూర్చి తనకు తానే సాటి అనిపించుకున్నారు సలీమ్ మాస్టర్.
ఈ రోజున ఎంతోమంది నృత్య దర్శకులుగా రాణిస్తున్న వారి గురువులకే గురువు సలీమ్ మాస్టర్. ఆయన వద్ద శిష్యరికం చేసిన శివశంకర్, శివ-సుబ్రహ్మణ్యం వంటి వారు తరువాతి రోజుల్లో గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. డాన్స్ కొరియోగ్రాఫర్ గా తిరుగులేని విధంగా సాగిన సలీమ్ చెన్నైలో ఓ అందమైన నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ఇంటిని యన్టీఆర్ చేతులు మీదుగానే ప్రారంభించారు. అలాగే ఓ షాపింగ్ కాంప్లెక్స్ నూ కట్టారు. అందులో ఇద్దరు సోదరులు హార్డ్ వేర్ బిజినెస్ చేసేవారు. వారికి ఆ షాప్ కలిసొచ్చింది. సలీమ్ కొన్ని కారణాల వల్ల వారిని ఖాళీ చేయమన్నారు. వారు ఖాళీ చేయడానికి నిరాకరించారు. కోర్టు నోటీసులు ఇచ్చినా, ఖాళీ చేయకపోవడంతో ఆ సోదరుల మీదకు సలీమ్ మందితో వెళ్ళి దాడి చేశారు. ఆ దాడిలో ఆ అన్నదమ్ములు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి చేర్చేలోపు కన్నుమూశారు. ఆ కేసులో సలీమ్ తో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు. చిత్రసీమలో తిరుగులేని కొరియోగ్రాఫర్ గా బతికిన సలీమ్, జైలులో ఉన్నప్పుడే తాగుడుకు బానిసయ్యారు. ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చి, విపరీతమైన తాగుడుతో తడిసిముద్దయ్యారు. కుటుంబసభ్యులు సైతం అసహ్యించుకొని గెంటేశారు. చివరకు హైదరాబాద్ చేరి కృష్ణానగర్ లో ఓ చిన్న గదిలో ఉండేవారు. మళ్ళీ చెన్నైకి వెళ్ళి అక్కడే ఆయన కన్నుమూశారు.
ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో సలీమ్ మాస్టర్ బాణీ ప్రత్యేకమైనది. ఆ తీరున సూపర్ స్టార్ డమ్ చూసిన డాన్స్ మాస్టర్ మరొకరు కానరారు. ఆయన కంటే ముందు ఎంతోమంది గొప్ప నృత్యదర్శకులు ఉన్నారు. కానీ, ఈ స్థాయిలో స్టార్ డమ్ చూసిన వారు లేరు.