జాతీయ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ ధనుష్ నటిస్తున్న భారీ పిరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. 1930 -40 ప్రాంతానికి సంబంధించిన కథతో ఈ సినిమాను హయ్యెస్ట్ బడ్జెట్ తో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఇటీవలే ప్రామెసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర కోసం ఈ ప్రాజెక్ట్ లో చేరారు. తాజాగా ఈ మూవీ కోసం కథానాయికలను ఖరారు చేశారు.
ఇప్పటికే తెలుగువారికి ‘గ్యాంగ్ లీడర్’ ‘శ్రీకారం’ మూవీలతో సుపరిచితురాలైన ప్రియాంక మోహన్ ఒక నాయిక కాగా, ‘హలో’, ‘సళల్’, ‘అన్యాస్ ట్యుటోరియల్స్’ ఫేమ్ నివేదిత సతీష్ మరో నాయికగా ఎంపికయ్యారు. ‘ఇంత భారీ ప్రాజెక్ట్ లో భాగం కావడం, ధనుష్ జోడిగా నటించే అవకాశం రావడం ఆనందంగా వుందని ప్రియాంక మోహన్ తెలిపింది. అరుణ్ మాథేశ్వరన్, సత్యజ్యోతి ఫిల్మ్స్ కి కృతజ్ఞతలు తెలియచేస్తూ, షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నానని ప్రియాంక ట్వీట్ చేసింది. అలానే ”నా మనసుకు దగ్గరైన ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ని చేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచినందుకు ‘కెప్టెన్ మిల్లర్’ టీంకి కృతజ్ఞతలు. గొప్ప స్ఫూర్తినిచ్చే ధనుష్ గారితో నటించే అవకాశం రావడం నమ్మశక్యం కావడం లేదు. ఈ సినిమా షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా” అని నివేదిత సతీష్ సైతం ట్వీట్ చేసింది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.