Venkatesh: విక్టరీ వెంకటేశ్ నటించిన ‘నారప్ప’ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అయితే ఆ సంస్థను రిక్వెస్ట్ చేసి… ‘నారప్ప’ మూవీని వెంకటేశ్ బర్త్ డే డిసెంబర్ 13న థియేటర్లలో ప్రదర్శించేందుకు అనుమతి తీసుకున్నామని సురేశ్ బాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ్టి సినిమాల పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. వెంకటేశ్ ఫ్యాన్స్ కోరిక మేరకు ‘నారప్ప’ను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని చెబుతూ, ”ఈ సినిమాతో పాటే డిఫరెంట్ ఫిలిమ్స్ లోని సాంగ్స్ ను కూడా ఎంటర్ టైన్ మెంట్ కోసం ఆ రోజు ప్రదర్శిస్తామ’ని తెలిపారు. ఈ మూవీ ప్రదర్శన ద్వారా వచ్చే మొత్తాన్ని ఛారిటీకి అందించాలని ఆలోచిస్తున్నామని సురేశ్ బాబు చెప్పారు.
‘కేజీఎఫ్, కాంతార’ చిత్రాలు అంత గొప్ప విజయాన్ని సాధిస్తాయని ఎవరూ ఊహించలేదని, ఇలా పరభాషా చిత్రాలు సక్సెస్ అయినప్పుడు లోకల్ ఫ్యాన్స్ ఫీల్ కావడం సహజమని సురేశ్ బాబు వ్యాఖ్యానించారు. గతంలో మన తెలుగు సినిమాలు ‘పుష్ఫ, ఆర్.ఆర్.ఆర్.’ ఇతర రాష్ట్రాలలో విడుదలైనప్పుడు అక్కడి నిర్మాతలు, హీరోలు, వారి అభిమానులు కొంత బాధపడిన మాట వాస్తవమని అన్నారు. ఇవాళ సినిమాకు సరిహద్దులు చెరిగిపోయాయని, అందువల్ల ఇలాంటి సమస్యలు సర్వ సాధారణమని, వాటిని తట్టుకుని ముందుకు సాగిపోవాలని హితవు పలికారు.
తెలుగు సినిమాకు ఇవాళ దేశ వ్యాప్తంగా ఆదరణ ఉందని, అలానే మొన్నటి వరకూ కన్నడ చిత్రాలను పెద్దంతగా పట్టించుకోని జనం ఇప్పుడు వాటినీ చూస్తున్నారని తెలిపారు. స్టార్ కాస్ట్ కంటే కంటెంట్ కే జనం ప్రాధాన్యమిస్తున్నారని, ‘అవతార్-2’ లో నటించిన స్టార్స్ ఎవరో, ఎవరికీ తెలియకపోయినా, కంటెంట్ కారణంగా ఆ సినిమా కోసం కోట్లాదిమంది వేచి చూస్తున్నారని అన్నారు. గతంలో చిన్న సినిమాలను పక్కన పెట్టి డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యమిస్తున్నారని కొందరు వాపోయేవారని, ఇప్పుడు పెద్ద సినిమాలను కూడా డబ్బింగ్ సినిమాల కోసం పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయని, ఇలాంటివన్నీ సినిమా రంగంలో సాధారణ విషయాలని, పరిస్థితులతో పాటు మనమూ మారాల్సిందేనని సురేశ్ బాబు చెప్పారు.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల గురించి చెబూతూ, ”నేను ఈ మధ్య కొందరు మిత్రులతో కలిసి కొన్ని సినిమాలు నిర్మించాను. కానీ అవి గొప్ప ఫలితాలను అందించలేకపోయాయి. నేను అనుకున్న విధంగా వాటిని తీయలేకపోవడమే అందుకు కారణం. అందుకనే వెంకటేశ్, రానాలతో సోలో ప్రొడ్యూసర్ గా రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. వెంకటేశ్ తో మూవీ వచ్చే ఫిబ్రవరిలో మొదలువుతుంది. ప్రస్తుతం తను ‘రానా నాయుడు’ వెబ్ సీరిస్ తో పాటు, సల్మాన్ ఖాన్ హిందీ మూవీలో నటిస్తున్నాడు. ఇక మా రెండో అబ్బాయి అభిరామ్ తో ఆనంది ఆర్ట్స్ సంస్థ తేజ దర్శకత్వంలో నిర్మించిన ‘అహింస’ సినిమా ఈ నెల లేదా వచ్చే నెలలో జనం ముందుకు వస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నిర్మాత కిరణ్ అందిస్తారని సురేశ్ బాబు చెప్పారు.