Raju Srivatsava: ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. జిమ్ చేస్తుండగా రాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మొన్నటివరకు అతడి మెదడు పనిచేసిందని, మూడు రోజుల నుంచి అతడి బ్రెయిన్ డెడ్ అవ్వడం వలన ఎలాంటి చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తెలుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకొంది. రాజు శ్రీవాత్సవ ఉన్న హాస్పిటల్ లోకి ఒక ఆగంతకుడు చొరబడ్డాడు. కోమాలో ఉన్న అతనితో సెల్ఫీలు దిగుతూ వింతగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగినట్లు చెప్పుకొస్తున్నారు.
హాస్పిటల్ లో అందరి కళ్లు కప్పి ఒక వ్యక్తి రాజు శ్రీవాత్సవ ఉన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ కోమాలో ఉన్న అతనితో నవ్వుతు సెల్ఫీలు తీసుకున్నాడు. అక్కడ ఉన్న సిబ్బంది చూసి పట్టుకొనేలోపు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ ఘటనపై భయపడిన కమెడియన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఆగంతకుడు ఎవరు అనేది కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతడు రాజు శ్రీవాత్సవ వీరాభిమాని కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.