మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజిషన్‌లో, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ‘యోగా ఆంథెమ్’ సాంగ్‌ను ప్రముఖ దర్శకులు మారుతి రిలీజ్ చేశారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్, దర్శకులు మారుతి, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – “మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. మనసు, శరీరాన్ని కలిపే శక్తి యోగాకు ఉంది. ఏ పేటెంట్ లేకుండా మనం ప్రపంచానికి అందించిన బహుమతి యోగా. ఈ పాటను అన్ని భాషల వారికీ అర్థమయ్యేలా రాయాలని అనుకున్నాను. అందుకే ఎక్కువగా సంస్కృత పదాలు వాడాను. సంస్కృతాన్ని దైవ భాష అంటారు. ఈ పాట రూపకల్పన చేసి నాతో రాయించాలని అశోక్ గారు అనుకున్నందుకు ధన్యవాదాలు. యోగాకు ప్రచారం కల్పిస్తూ, దానికి ప్రత్యేకమైన రోజును ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం లోక కల్యాణానికి మంచిది. యోగాకు ప్రాధాన్యత ఇస్తున్న మన నాయకులందరికీ ధన్యవాదాలు.” అన్నారు.