Indian Cinema: ఒకప్పుడు మార్కెట్ తగ్గిపోయిన హీరోలు, కెరీర్ చరమాంకంలో ఉన్న సీనియర్ నటులు మాత్రమే నెగెటివ్ రోల్స్ వైపు చూసేవారు. సంజయ్ దత్, బాబీ డియోల్, జగపతి బాబు లాంటి వాళ్లు విలన్లుగా మారి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోవడం చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. చేతినిండా స్టార్డమ్, బాక్సాఫీస్ వద్ద తిరుగులేని క్రేజ్ ఉన్నప్పటికీ.. వెండితెరపై హీరోలను ఢీకొట్టేందుకు టాప్ స్టార్స్ ఏమాత్రం వెనకాడటం లేదు. రొటీన్ హీరో పాత్రలతో బోర్ కొట్టకుండా, తమలోని అసలైన నటుడిని చూపించేందుకు స్టార్ హీరోలంతా ఇప్పుడు పవర్ ఫుల్ విలనిజం వైపు పరుగులు తీస్తున్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమను ‘కేజీఎఫ్’తో గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన రాకింగ్ స్టార్ యశ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పాన్-ఇండియా స్టార్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే, భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంలో రావణాసురుడి పాత్రను పోషించేందుకు ఒప్పుకున్నాడు. ఇక మలయాళంలో హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా విపరీతమైన డిమాండ్ ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం టాలీవుడ్లో విలన్ అవతారం ఎత్తాడు. మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’ మూవీలో ‘రణకుంభ’ అనే సరికొత్త నెగెటివ్ రోల్లో విశ్వరూపం చూపించబోతున్నాడు.
మరోవైపు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రూట్ మరింత విభిన్నం. హీరోగా ఎన్ని హిట్లు పడినా, పాత్ర నచ్చితే చాలు విలన్‌గా మారిపోతాడు. ‘విక్రమ్’, ‘జవాన్’ చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్‌తో అదరగొట్టిన ఆయన.. రీసెంట్గా ‘మహారాజ’, ‘తలైవన్ తలైవి’ వంటి భారీ హిట్స్ అందుకున్న తర్వాత కూడా మళ్లీ విలన్ వేషాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోగా చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ దర్శకుడు వెట్రిమారన్ కోరడంతో సింబు హీరోగా వస్తున్న ‘అరసన్’లో నెగెటివ్ రోల్ చేయడానికి సై అన్నాడు. ఇక బాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న అభిషేక్ బచ్చన్ సైతం షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ మూవీలో ప్రధాన ప్రతినాయకుడిగా తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఎప్పుడూ ఒకే తరహా హీరో వేషాలు వేస్తే ప్రేక్షకులకే కాదు.. తమకు కూడా బోర్ కొడుతుందని భావిస్తున్న ఈ డైనమిక్ స్టార్స్, వెండితెరపై ప్రతినాయకులుగా మెరుస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు.

