Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?

Yash Toxic

Yash Toxic

‘టాక్సిక్’ రిలీజ్ ఎప్పుడు అంటే.. “ఆ బొక్కటి అడక్కు” అంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినా రిలీజ్‌కు నోచుకోవడం లేదు. ఓటిటి (OTT) కాకపోవడం వలనే రిలీజ్ డేట్ ప్రకటించడం లేదన్న టాక్ నడుస్తోంది. సినిమా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలో కూడా విడుదల తేదీ ప్రకటించలేదు, ఎందుకు?

ఈ మధ్యకాలంలో ‘టాక్సిక్’ పై వచ్చినన్ని విమర్శలు మరొక సినిమాపై రాలేదు. గ్లింప్స్ వచ్చినా, టీజర్ వచ్చినా చర్చ జరగాల్సిందే.. విమర్శలు ఫేస్ చేయాల్సిందే. ముఖ్యంగా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్‌ని టార్గెట్ చేశారు. “ఇంత వైలెన్స్, హద్దు మీరిన రొమాన్స్ ఏంటి” అంటూ మోహన్‌దాస్‌పై విమర్శలు వస్తే.. యష్ సమర్థించడమే కాదు, ఆమెపై పొగడ్తలు కురిపించాడు. ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ అయిన తర్వాత యష్ తీసుకున్న మూడేళ్ల గ్యాప్‌లో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్‌కు ఛాన్స్ ఇచ్చి యష్ షాక్ ఇస్తే.. గ్లింప్స్, టీజర్‌తో డైరెక్టరే షాక్ ఇచ్చింది.

×
×
Ad

విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ పేరు హైలైట్ అయింది. “లేడీ డైరెక్టర్ అయి ఉండి ఇలాంటిది తీస్తావా” అంటూ సోషల్ మీడియా మండిపడింది. గీతుపై ఎందరు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినా, యష్ మాత్రం తెగ మెచ్చుకున్నాడు. సినిమాకాన్ ఈవెంట్‌లో ‘టాక్సిక్’ రొమాంటిక్ సీన్స్‌పై యష్ మౌనం వీడాడు. సాధారణంగా గ్యాంగ్‌స్టర్ మూవీస్ మేల్ డైరెక్టర్స్ే బాగా చేస్తారనే భావన ఉందని.. కానీ ఓ మహిళా కోణంలో చూపించడం, గీతు ప్రెసెంట్ చేసిన విధానం చాలా డిఫరెంట్‌గా ఉందన్నాడు యష్. సినిమా సీన్స్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయని, అన్ని రకాల ఎమోషన్స్‌ను లేడీ డైరెక్టర్స్ ఇంత బాగా ప్రెసెంట్ చేయగలరా అని ఆమెతో జర్నీ చేశాకనే తనకు అర్థమైంది అన్నాడు.

మార్చి 19న రావాల్సిన ‘టాక్సిక్’, జూన్ 4కు వెళ్లి మరొకసారి వాయిదా పడింది. రిలీజ్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నా.. మేకర్స్ మాత్రం మౌనంగా ఉన్నారు. గీతు బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలోనూ విడుదల తేదీ ప్రకటించలేదు. ఓటిటి నుంచి 200 కోట్లు వస్తుందని నిర్మాత ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే.. 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. 500 కోట్లతో రూపొందిన ఈ హెవీ బడ్జెట్ మూవీకి ఓటిటి రైట్స్ చాలా అవసరం, కానీ అదే తెగడం లేదు.. ముడిపడడం లేదు.