నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 30) నాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు, ఏపీ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, సహజ నటి జయసుధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read : MegaStar : అల్లు కనకరత్నం గారి నేత్రదానం ఎందరికో స్ఫూర్తి దాయకం
కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘నాకు ఇంతటి ధన్యమైన జన్మను ఇచ్చిన దైవాంశ సంభూతుడు, నా గురువు, నా దైవం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, కళా ప్రపూర్ణ, నట రత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, నా తల్లి బసవతారకం గారికి ధన్యవాదాలు. నాది చాలా పెద్ద కుటుంబం. హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు, తెలుగు చిత్ర సీమలోని శ్రేయోభిలాషులు ఇలా నాది చాలా పెద్ద కుటుంబం. నేను ఇండస్ట్రీలో 50 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణాన్ని పూర్తి చేశాను. నాకు ఈ లెక్కలన్నీ సరిగ్గా గుర్తుండవు. అంకెలన్నీ కూడా అభిమానులు గుర్తు పెట్టుకుంటారు. కోట్ల మంది అభిమానాన్ని పొందడం నా పూర్వ జన్మ సుకృతం, జన్మజన్మల రుణబంధం అని అనిపిస్తుంటుంది. సినిమా అనేది బలమైన మాధ్యమం. నా దర్శక, నిర్మాతల సహకారంతోనే ఈ స్థాయికి వచ్చాను. ఏపీలోనూ ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ది చేయాలని కోరుకుంటున్నాను. నేను 13 ఏళ్ల వయసులోనే ‘తాతమ్మ కల’ మూవీ చేశాను. గత ఐదు దశాబ్దాల్లో నేను ఎన్నో జానర్లలో, ఎన్నెన్నో పాత్రల్ని పోషించాను. ‘ఆదిత్య 369’ అనేది ఇండియాలో మొట్ట మొదటి సైఫై చిత్రం. 50 ఏళ్లలో 110 చిత్రాలు చేశాను. నేను చిత్ర సీమకు చేసిన సేవకు గానూ ఈ గుర్తింపు దక్కడం ఆనందంగా ఉంది. ఇవన్నీ నేను ఒక్కడినే సాధించలేదు. ఈ ప్రయాణంలో నా దర్శక, నిర్మాతలు, కుటుంబ సభ్యులు, అభిమానులు అండగా నిలిచారు. నా భార్య వసుంధర ఈ ప్రయాణంలో నా వెన్నంటే నిల్చుని కుటుంబాన్ని చూసుకున్నారు. కేంద్రం నుంచి రీసెంట్గా పద్మ భూషణ్ అవార్డు లభించింది. ‘భగవంత్ కేసరి’కి ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా అవార్డు వచ్చింది. నేను చేసిన ‘అన్ స్టాపబుల్’ షో అరుదైన రికార్డులు సాధించింది. నాకు ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. నాకు విషెస్ అందించిన అమితాబ్ గారికి, రజినీకాంత్ గారికి ధన్యవాదాలు. అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయాల్ని, రికార్డుల్ని సాధించాను. ఇదే ఉత్సాహం, ప్యాషన్‌తో మున్ముందుకు సాగుతానని మాటిస్తున్నాను’ అని అన్నారు.