Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్‌సేన్!

Vishwak Sen

Vishwak Sen

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘కల్ట్’. గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అక్టోబరు 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ‘ఫలక్‌నుమా దాస్’ తర్వాత విశ్వక్ మళ్లీ మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా కావడంతో దీనిపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. సరిగ్గా రిలీజ్ ముంగిట నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో హీరో విశ్వక్‌సేన్ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

గురువారం అత్యంత ఘనంగా నిర్వహించాల్సిన ‘కల్ట్’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు విశ్వక్‌సేన్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న ‘అర్నబ్’ తుపాను బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రకృతి విపత్తుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వేడుకలు చేసుకోవడం సరికాదని ఆయన భావించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. ఈవెంట్‌ను రద్దు చేయడానికి గల కారణాన్ని అభిమానులతో పంచుకున్నారు.

కేవలం ఈవెంట్ రద్దు చేయడమే కాకుండా, తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు అందరూ తోడుగా నిలబడాలని విశ్వక్‌సేన్ పిలుపునిచ్చారు. క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉండటమే మన ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా సినిమా రిలీజ్‌కు ముందు మైలేజ్ కోసం ఎంతటి పరిస్థితుల్లోనైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహించడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. కానీ విశ్వక్‌సేన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ నుంచి పాజిటీవ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈవెంట్ రద్దయినప్పటికీ, సినిమా మాత్రం ముందుగా ప్రకటించిన విధంగానే అక్టోబరు 30న థియేటర్లలో విడుదల కానుంది. మరోసారి డైరెక్టర్ క్యాప్ పెట్టి విశ్వక్ చేసిన ఈ ప్రయోగం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.