ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయట పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి అన్నా లెజినోవా పద్మావతి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. స్వామి వారి దర్శనానంతరం అన్నా లెజినోవా తన కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. తర్వాత నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి, భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు అన్నా. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే కొంత మంది అన్నా తలనీలాలు ఇవ్వడం పై ట్రోల్స్ చెస్తున్నారు.. సనాతనంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరైంది కాదంటున్నారు. అయితే ఈ మాటలపై సీనియర్ నటి విజయశాంతి స్పందించారు.
‘ దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడేందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వేంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్ కు విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు’ అంటూ ట్వీట్ చేసింది.