Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!

Vijay Rashmika

Vijay Rashmika

Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) జోడీని టార్గెట్ చేస్తూ నెట్టింట సాగుతున్న అసత్య ప్రచారాలపై ఎట్టకేలకు చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరి వ్యక్తిగత జీవితంపై లేనిపోని కట్టుకథలు అల్లుతూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై విరోష్ టీమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హద్దులు దాటి ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి (ఇంపర్సనేషన్), ఫ్యాబ్రికేటెడ్ కంటెంట్‌తో పాటు మార్ఫింగ్ చేసిన నకిలీ స్క్రీన్‌షాట్లను నెట్టింట వైరల్ చేస్తున్నారని టీమ్ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే వీరిద్దరిపై తప్పుడు కథనాలు అల్లుతూ ఆన్‌లైన్ వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేవలం వ్యూస్, లైక్స్ కోసమే కాకుండా పక్కా ప్లాన్ ప్రకారం తమ పరువు తీసేలా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారి వివరాలను పోలీసులకు సమర్పించినట్లు తెలుస్తోంది.

తమపై వస్తున్న విడాకుల పుకార్లపై తాజాగా విజయ్, రష్మిక ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కొందరు ఆకతాయిలు ఫేక్ చాట్స్, మార్ఫింగ్ ఫోటోలతో హద్దులు దాటి అసభ్యకర పోస్టులు పెడుతుండటంతో, ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకుని ఈ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ అధికారులు ఆయా నకిలీ పోస్టులు పెట్టిన ఖాతాలను, వాటిని సర్క్యులేట్ చేసిన అడ్మిన్లను గుర్తించే పనిలో పడ్డారు. తప్పుడు రాతలు రాసేవారికి, ఫేక్ పోస్టులు క్రియేట్ చేసేవారికి గట్టి వార్నింగ్ ఇచ్చేలా చర్యలు ఉండబోతున్నట్లు సమాచారం.