Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ ‘రణబాలి’ థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ బజ్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ సినిమాపై వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సినిమా బాక్సాఫీస్ లెక్కలు, నెంబర్ గేమ్ గురించి విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సినిమాలు హిట్ అవ్వడం, బిజినెస్ పరంగా ఆడటం మా అందరికీ చాలా అవసరం. కానీ ‘రణబాలి’ విషయానికి వస్తే.. కేవలం ఒక హిట్టు కొట్టాలని లేదా ఏదో బాక్సాఫీస్ కలెక్షన్లు చూపించాలని మేము ఈ సినిమా చేయలేదు. ఇది మన ప్రజలకు చెప్పాల్సిన ఎంతో ముఖ్యమైన కథ. రాహుల్ దీన్ని ఎన్నో లేయర్లతో అద్భుతంగా తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ చూసిన దానికంటే సినిమాలో ఎన్నో కొత్త అంశాలున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ కొన్ని ప్రత్యేక సన్నివేశాల గురించి చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు” అని స్పష్టం చేశారు.
నిన్న రాత్రి తామంతా కలిసి సినిమా చూసిన అనుభవాన్ని పంచుకుంటూ.. “ప్రపంచం ఏమనుకుంటుందో అనే లెక్కలు లేకుండా మా టీమ్ మొత్తం 25 మందిమి కలిసి నిన్న సినిమా చూశాం. సినిమా చూసిన వెంటనే నాకు అనిపించింది ఒక్కటే.. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ తెలుగు చిత్రాల్లో ‘రణబాలి’ కచ్చితంగా ఒకటిగా నిలుస్తుంది. నేను ప్రీ-రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పా.. తెలుగు సినిమా గర్వపడేలా ఇది ఉంటుందని. ఇది నా 14వ సినిమా. భవిష్యత్తులో నేను 25, 30 సినిమాలు చేసినా కూడా.. ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని ప్రత్యేక చిత్రాలు ఉంటాయి. అందులో ‘రణబాలి’ నా ఫిల్మోగ్రఫీలో, అలాగే తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. సినిమా చూసిన తర్వాత తన మిత్రులు, సినీ ప్రముఖుల నుంచి వస్తున్న రియాక్షన్ గురించి విజయ్ మాట్లాడుతూ.. చాలా మంది ఫోన్ చేసి ఎమోషనల్గా మాట్లాడారన్నారు. రేపటి నుంచి మేమంతా నేరుగా ప్రేక్షకుల వద్దకు వస్తున్నాం. విజయవాడ, గుంటూరు, వైజాగ్ లతో పాటు సింగనమల కథ జరిగిన అనంతపురం కూడా వెళ్లి మీ అందరితో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అని విజయ్ ప్రకటించారు. బాక్సాఫీస్ నెంబర్ల గోల కంటే కథలోని నిజాయితీనే ముఖ్యమని రౌడీ హీరో కుండబద్దలు కొట్టిన తీరు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

