Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ తర్వాత దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ వీరిద్దరి కలయికలో ‘ఆదర్శ కుటుంబం’ తెరకెక్కుతుంది. తాజాగా జరిగిన ఈ చిత్రంలోని “నారాయణమ్మ” సాంగ్ లాంచ్ వేదికపై వెంకటేష్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
“ఆ రోజులు అయిపోయాయి.. ఇది వేరే లెవెల్ కుటుంబం!”
వేదికపై వెంకటేష్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్‌తో మళ్లీ సినిమా చేయాలన్నప్పుడు కథ విషయంలో తమపై ఒత్తిడి ఉండేదని వెల్లడించారు. “నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వచ్చి 20 ఏళ్లు దాటింది. అప్పట్లో ‘పెళ్లి కాని ప్రసాద్’ క్యారెక్టర్లు నడిచాయి కానీ, ఇప్పుడు ఆ రోజులు పోయాయి, పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. మరి ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలనే ప్రెజర్ మాపై చాలా ఉండేది. ఆ సమయంలో త్రివిక్రమ్ అద్భుతమైన కథ, స్క్రిప్ట్‌తో ముందుకు వచ్చారు. యాక్షన్, సెంటిమెంట్, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఊహించని ట్విస్టులు, ఎగ్జైటింగ్ బ్లాక్స్‌తో చాలా ఫ్రెష్‌గా సినిమాను మలిచారు” అని వెంకీ స్పష్టం చేశారు. సినిమాలోని పాత్రల గురించి చెబుతూ.. “ఇది నాటీ కుటుంబమో, క్యూట్ కుటుంబమో కాదు.. వేరే లెవెల్ ఆదర్శ కుటుంబం. ఇందులో నా భార్య స్వర్ణ ఎప్పుడూ అప్పులు చేస్తూనే ఉంటుంది, నేనేమో వంటింట్లో పప్పు చేసుకుంటూ ఉంటాను. ఇంకోడు పదికి నాలుగు కూడలేక సతమతమవుతాడు. ఈ రచ్చల మధ్య నలిగిపోయే ‘చిట్టిబాబు’గా నేను కనిపిస్తాను” అంటూ కథలోని ఫన్ ఎలిమెంట్స్‌ను పంచుకున్నారు. “జీవితంలో మనం ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, ఏ టూ జెడ్ అంతా భగవంతుడికే వదిలేయండి. ఆయన మనల్ని చూసుకుంటాడు. ప్రకృతితో, యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వండి.. అందరికీ మంచి చేయండి” అని ఫ్యాన్స్‌కి సందేశమిచ్చారు. హారిక అండ్ హాసిని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 9న థియేటర్లలోకి రానుంది.

