Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!

Adarsha Kutumbam

Adarsha Kutumbam

Trivikram: టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబితేనే ఒకప్పుడు థియేటర్లు కళకళలాడేవి. అయితే 2024 సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ తీవ్రంగా నిరాశపరచడం, ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో అనుకున్న ప్రాజెక్ట్‌లు వర్కవుట్ కాకపోవడం, ముఖ్యంగా తారక్‌తో తీయాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ ఆలస్యం కావడంతో గురూజీ కెరీర్ కాస్త నెమ్మదించింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో, గుంటూరు కారం ఫెయిల్యూర్‌ను జనాలు మర్చిపోవాలన్నా.. త్రివిక్రమ్ మళ్లీ ట్రాక్‌లోకి రావాలన్నా ఇప్పుడు రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా హిట్ కొట్టడం అత్యంత కీలకంగా మారింది.

‘నువ్వు నాకు నచ్చావు’, ‘మల్లేశ్వరి’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌కు కథ, మాటలు అందించిన త్రివిక్రమ్.. విక్టరీ వెంకటేష్‌ను డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్’ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న వెంకటేష్.. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ చూస్తుంటే వెంకీ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్‌తో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రెడీ అయినట్లు కనిపిస్తోంది.

చాలా వాయిదాల తర్వాత ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిజానికి దసరా హాలిడేస్ సీజన్‌ను మిస్ చేసుకుని, వీక్ డేస్‌లో థియేటర్లలోకి దిగుతుండటం ఒకరకంగా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. అయితే సినిమాపై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తే దీపావళి వరకు లాంగ్ రన్ ఉంటుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. ఫ్యామిలీ కథలను తెరకెక్కించడంలో ఎక్స్‌పర్ట్ అయిన త్రివిక్రమ్.. వెంకీతో కలిసి మళ్లీ తన మ్యాజిక్‌ను రిపీట్ చేసి హిట్ కొడతారో లేదో చూడాలి.