Varanasi: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్-వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ రిలీజ్ డేట్‌పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే, సరిగ్గా అదే సమయంలో దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ పీక్ స్టేజ్‌లో ఉండనుండటంతో, సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అదొక బలమైన ఎమోషన్. ఇక ఐపీఎల్ మొదలైందంటే చాలు.. సామాన్యుల నుంచి సినీ ప్రియుల వరకు అంతా స్టేడియాలకు లేదా టీవీలకే అతుక్కుపోతారు. ఇంతటి భారీ క్రేజ్ ఉన్న సమయంలో ఎంత పెద్ద సినిమా విడుదలైనా బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయిలో వసూళ్లు రాబట్టడం కష్టమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ ఐపీఎల్ సీజన్ కారణంగా పలు భారీ చిత్రాలు తమ రిలీజ్ డేట్లను మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పాన్-వరల్డ్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘వారణాసి’కి కూడా ఐపీఎల్ సెగ తగిలేలా కనిపిస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఐపీఎల్ పోటీని తప్పించుకోవడంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించే ఉద్దేశంతో మేకర్స్ రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలో ఉన్నారట. ఏప్రిల్ 7కు బదులుగా వచ్చే ఏడాది జూలై చివరి వారంలో ‘వారణాసి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు, సినిమా ప్రొడక్షన్ విషయంలో చిత్రబృందం ఇటీవలే అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ‘వారణాసి’ షూటింగ్ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, సీజీ, రీ-రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ప్రపంచంతో పాటు కాలాన్ని చుట్టేసే ఒక సాహసికుడి కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో మహేశ్ బాబు రుద్రగా, శ్రీరాముడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారు. ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ అనుకున్న సమయానికే ఏప్రిల్ 7న వస్తుందా? లేక ఐపీఎల్ కారణంగా జూలైకి వాయిదా పడుతుందా? అనేది తెలియాలంటే రాజమౌళి బృందం అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

