Site icon NTV Telugu

Krishnam Raju- Vanisri: కృష్ణంరాజు విజ‌య‌నాయిక వాణిశ్రీ‌!

Krishnam Raju. Vanisri

Krishnam Raju. Vanisri

కృష్ణంరాజు ఎంద‌రు క‌థానాయిక‌ల‌తో న‌టించినా, ఆయ‌న‌కు అచ్చివ‌చ్చిన నాయిక వాణిశ్రీ అనే చెప్పాలి. వాణిశ్రీ‌తో క‌ల‌సి కృష్ణంరాజు అంత‌కు ముందు ప‌లు చిత్రాల‌లో న‌టించారు. కొన్ని చిత్రాల‌లో ఆమెను రేప్ చేయ‌బోయే విల‌న్ గానూ క‌నిపించారు. అయితే వారిద్ద‌రూ క‌ల‌సి న‌వ‌లా చిత్రం `జీవ‌న‌త‌రంగాలు`లో అక్క‌-త‌మ్ముడుగా న‌టించారు. ఆ సినిమా ఇద్ద‌రికీ మంచి పేరు సంపాదించి పెట్టింది. త‌న‌కు హీరో అవ‌కాశాలు అంత‌గా ల‌భించ‌ని స‌మ‌యంలో మిత్రులు హ‌రిరామ‌జోగ‌య్య‌, చ‌ల‌సాని గోపితోక‌ల‌సి గోపీకృష్ణా మూవీస్ అనే బ్యాన‌ర్ నెల‌కొల్పి, తొలి ప్ర‌య‌త్నంగా `కృష్ణ‌వేణి` అనే చిత్రాన్ని నిర్మించి న‌టించారు కృష్ణంరాజు.

ఆ స‌మ‌యంలో వాణిశ్రీ స్టార్ హీరోయిన్ గా సాగుతున్నారు. అయితే కృష్ణంరాజు అడ‌గ్గానే ఆమె `కృష్ణ‌వేణి` చిత్రానికి కాల్ షీట్స్ ఇచ్చారు. ఈ సినిమాకు క‌న్న‌డ‌లో పుట్ట‌న్న క‌ణ‌గ‌ల్ రూపొందించిన `శ‌ర‌పంజ‌ర‌` చిత్రం ఆధారం. క‌న్న‌డ‌లో క‌ల్ప‌న పోషించిన పాత్ర‌ను తెలుగులో వాణిశ్రీ ధ‌రించారు. `కృష్ణ‌వేణి` చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా స‌క్సెస్ తో కృష్ణంరాజుకు హీరోగా మంచి గుర్తింపు ల‌భించింది. ఆ తరువాత త‌మ గోపీకృష్ణా మూవీస్ ప‌తాకంపైనే బాపు ద‌ర్శ‌క‌త్వంలో కృష్ణంరాజు నిర్మించి, న‌టించిన `భ‌క్త క‌న్న‌ప్ప‌`లోనూ వాణిశ్రీ‌నే నాయిక‌గా ఎంచుకున్నారు కృష్ణంరాజు. ఆ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించింది. కృష్ణంరాజు కోరుకున్న స్టార్ డ‌మ్ ను సంపాదించి పెట్టింది. అలా కృష్ణంరాజుకు విజ‌య‌నాయిక‌గా వాణిశ్రీ నిలిచారు. త‌రువాత `జీవ‌న తీరాలు`లోనూ కృష్ణంరాజు,వాణిశ్రీ న‌టించారు. ఆ పై కృష్ణంరాజు,వాణిశ్రీ న‌టించిన పౌరాణిక చిత్రం `స‌తీసావిత్రి` వ‌చ్చింది. వారిద్ద‌రూ జంట‌గా న‌టించిన మ‌రో పౌరాణికం `వినాయ‌క విజ‌యము` మంచి విజ‌యం సాధించింది. అలా కృష్ణంరాజుకు అచ్చివ‌చ్చిన నాయిక‌గా వాణిశ్రీ నిలిచారు.
Astrology : సెప్టెంబర్‌11, ఆదివారం దినఫలాలు

Exit mobile version