ప్రముఖ గీత రచయిత, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత వైరముత్తు మరోసారి వార్తల్లో నానుతున్నాడు. ఇటీవల కేరళకు చెందిన ఓఎన్వి లిటరరీ అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. దాంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. ఇదే సమయంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు ఈ అవార్డును ప్రకటించడం పట్ల గాయని చిన్మయితో పాటు కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో అగ్గిని రాజేయడంతో జ్యూరీ మెంబర్స్ ఇరకాటన పడి, మరోసారి తమ నిర్ణయాన్ని పునః పరిశీలస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో వైరముత్తు ఆ అవార్డును తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. మేధావులైన న్యాయనిర్ణేతలను ఇబ్బందులకు గురిచేయడం తనకు ఇష్టం లేదని, అందుకే అవార్డును తీసుకోనని అన్నారు.
ఇదిలా ఉంటే… ఈ వ్యవహారంలో వైరముత్తు తనయుడు మదన్ కార్కీ తండ్రి పక్షానే నిలిచాడు. చిన్మయి పేరు ఎత్తకుండా కొందరు తన తండ్రిని అనవసరం గా టార్గెట్ చేస్తున్నారని వాపోయాడు. అయితే… చిన్మయి మాత్రం వెనక్కి తగ్గేదే లే అంటోంది. గతంలో వైరముత్తు మీద తాను మీటూ ఆరోపణలు చేసినప్పుడు మదన్, అతని భార్య తనకు మద్దత్తు తెలిపారని, ఇప్పుడు మాత్రం అతను తండ్రిని సపోర్ట్ చేస్తూ తనను విమర్శిస్తున్నారని అంటోంది. మొత్తం మీద తమిళనాట మీటూ ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ చిన్న కదలిక వచ్చినా… చిన్మయి అండ్ టీమ్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఆ మధ్య తమిళనాడు ఎన్నికల సమయంలో కూడా మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు టిక్కెట్లు ప్రకటించినా, ప్రచార కమిటీలో తీసుకున్నా.. చిన్మయి ఆ యా పార్టీ నేతలను ఎండగట్టేసింది. మరి వైరముత్తు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.