మెగాస్టార్ చిరంజీవి పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని… సూపర్ స్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి నిస్వార్థ సేవ హృదయాన్ని తాకిందని, కరోనా మహమ్మారి కల్పించిన క్లిష్ట పరిస్థితులలో చిరంజీవి… అలాగే ఆయన బృందం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని తెలుపుతూ చిరంజీవి చేసిన సేవను సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ కు స్పందించిన చిరంజీవి “మీ దయగల మాటలకు ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారు… కరోనా సంక్షోభం విజృంభిస్తున్న సమయంలో నేను చేయగలిగిన చిన్న సహాయం మాత్రమే చేస్తున్నా” అంటూ రిప్లై ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంతోమంది రోగులు ఆక్సిజన్ అందక చనిపోతున్న నేపథ్యంలో వారి ప్రాణాలను కాపాడేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలోనూ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా ఎంతో మందికి నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందించారు. ఇటీవలే వేల మంది సినీ కార్మికులకు సిసిసి ద్వారా వ్యాక్సిన్ కూడా వేయించారు.