మాస్కులతో నోళ్లు మూస్కోవటం జనాలకి జీవితంలో భాగమైపోయింది. అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే, అమెరికాలో కొన్ని మల్టీ ప్లెక్సులు మాత్రం ‘మాస్క్ అక్కర్లేదు’ అంటున్నాయి! అయితే, ఇది అందరికీ వర్తించే రూల్ కాదు. అలాగే, అన్ని చోట్లా కూడా కాదు. పూర్తిగా వ్యాక్సినేషన్ ప్రక్రియని పూర్తి చేసిన ఆడియన్స్ తమ సినిమా హాళ్లలో మాస్క్ తీసేయవచ్చని యూఎస్ లోని మేజర్ సినిమా చైన్స్ తాజాగా ప్రకటించాయి. అయితే, ఇదంతా అన్ని చోట్లా వర్తించే నియమం కాదు. ఎక్కడైతే లోకల్ గవర్నమెంట్, ప్రభుత్వ అధికారులు మాస్క్ మ్యాన్డేటరీ అంటారో… అక్కడ మాస్క్ ధరించాల్సిందేనట. మరి వ్యాక్సినేషన్ తీసుకోని వారి సంగతి అంటారా? వారూ ఎలాగూ నోటికి అడ్డంగా గుడ్డ కట్టుకోవాల్సిందే! ప్యాండమిక్ దెబ్బతో సంవత్సర కాలంగా మూతబడ్డ నార్త్ అమెరికాలోని చాలా థియేటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. 75 శాతం వెలవెలబోతున్నాయి. తెరుచుకున్న వాటిల్లోనూ సొషల్ డిస్టెన్సింగ్ కట్టుదిట్టంగా పాటిస్తున్నారు. మాస్క్ నిబంధన కొంతైనా ఎత్తివేస్తే జనాలు మరింతగా థియేటర్స్ వైపు వస్తారని మల్టీ ప్లెక్స్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. చూడాలి మరి, అమెరికాలో పెద్ద తెర పూర్వ వైభవం ఎప్పటికి సంతరించుకుంటుందో!