సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీ, క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా మార్మోగిపోతోంది. రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలుతున్న త్రిష.. తాజాగా కోలీవుడ్ (Tamil Cinema) లో ఒక అరుదైన, మైండ్ బ్లోయింగ్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ముగ్గురు అగ్ర హీరోల కెరీర్‌లోనే ‘ఆల్-టైమ్ హయ్యస్ట్ గ్రాసింగ్’ (అత్యధిక వసూళ్లు సాధించిన) చిత్రాల్లో ఆమె భాగం కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ, త్రిష మాత్రం సెకండ్ ఇన్నింగ్స్‌లో అంతకంతకూ పవర్‌ఫుల్ ఫామ్‌లోకి వస్తూ ‘లక్కీ ఛార్మ్’గా మారిపోయారు. రీసెంట్‌గా ఒక అభిమాని సోషల్ మీడియాలో.. తమిళ టాప్ హీరోలైన విజయ్, అజిత్, సూర్యల కెరీర్ బెస్ట్ కలెక్షన్ల సినిమాల్లో త్రిషనే హీరోయిన్ అంటూ పెట్టిన ఒక స్పెషల్ పోస్ట్‌ను త్రిష తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ (Instagram Stories) లో షేర్ చేసుకున్నారు. ఆ అభిమానికి హార్ట్ ఎమోజీతో పాటు ప్రత్యేకంగా థాంక్యూ చెప్పారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘లియో’ చిత్రం ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 2023లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇందులో విజయ్ భార్యగా త్రిష నటించిన సంగతి తెలిసిందే. ఇక మైథ్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ వద్ద భారీ ర్యాంపేజ్ సృష్టించింది. అజిత్ కెరీర్‌లోనే బెస్ట్ హిట్‌గా నిలిచి రూ. 248 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న స్టార్ హీరో సూర్య.. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ చిత్రంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో త్రిష ‘లాయర్ ప్రీతి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో సూర్యకు జోడీగా మెప్పించారు. కాగా తమిళంలో ముగ్గురు టాప్ హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన త్రిష.. ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎలాంటి బాక్సాఫీస్ వండర్స్ క్రియేట్ చేయబోతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
