Tollywood: థియేటర్‌కు వెళ్లిన సగటు సినీ అభిమాని ఇంటర్వెల్ పడగానే “సినిమా బ్లాక్‌బస్టర్.. కాలర్ ఎగరేయండి” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నాడు. కానీ, మరో గంటన్నర గడిచి క్లైమాక్స్ పూర్తయ్యేసరికి సీన్ మొత్తం తలకిందులవుతోంది. ఉత్సాహంగా విజిల్స్ వేస్తూ సీట్లలోంచి లేచిన ప్రేక్షకులే, షో ముగిసేసరికి తల పట్టుకుని నిరాశగా బయటకు రావాల్సిన పరిస్థితి ఇటీవల కాలంలో కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని భారీ బడ్జెట్ చిత్రాలకు, స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్టులకు అతిపెద్ద విలన్‌గా మారింది మరేదో కాదు.. ‘సెకండాఫ్ ఫోబియా’.
భారీ బడ్జెట్లు, క్రేజీ కాంబినేషన్లతో వస్తున్న సినిమాలకు ఫస్టాఫ్ వరంలా మారుతుంటే, సెకండాఫ్ మాత్రం శాపంగా పరిణమిస్తోందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌ను ఓ రేంజ్లో డిజైన్ చేస్తున్న డైరెక్టర్లు, ఆ తర్వాత ఆ స్థాయి ఎమోషన్‌ను కానీ, ఉత్కంఠను కానీ క్లైమాక్స్ వరకు కొనసాగించలేక చేతులెత్తేస్తున్నారు. ఒక ఐటెం సాంగ్, ఒక ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్, భారీ ఫైట్ పెడితే సెకండాఫ్ గట్టెక్కేస్తుందనే పాత ఫార్ములానే నమ్ముకోవడంతో, కథ నత్తనడకన సాగుతూ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతోందనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి.
ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయిన భారీ చిత్రాల జాబితాను చూస్తే, అన్నింటికీ ఇదే సమస్య ఎదురైందని స్పష్టమవుతోంది. తాజాగా విడుదలైన ‘ఓం’ సినిమా నుంచి మొన్నటి ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’ వరకు ఇదే తంతు నడిచింది. రామ్ చరణ్ ‘పెద్ది’లో ఫస్టాఫ్ ఎమోషన్స్, రా యాక్షన్ థియేటర్లను ఊపేశాయి. కానీ, మూడు గంటలకు పైగా ఉన్న సుదీర్ఘ నిడివి, సెకండాఫ్‌లో కొన్ని ఎపిసోడ్లు సాధారణ ఆడియన్స్‌తో పాటు మెగా అభిమానులను సైతం అసహనానికి గురిచేశాయనే కామెంట్స్ వినిపించాయి.
నాని ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ 1980ల నాటి ఇంటెన్సిటీని ద్వితీయార్థంలో క్యారీ చేయలేకపోయారనే విమర్శలు వినిపించాయి. ఎడిటింగ్ లోపాలు, సాగతీత సీన్లు సినిమాకు మైనస్‌గా మారాయనే కామెంట్స్ ఆడియన్స్ నుంచి వినిపించాయి. గతంలో శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’లో పొలిటికల్ సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయినా, రొటీన్ సెకండాఫ్ ఫార్ములా దెబ్బకొట్టింది. ప్రభాస్ ‘ది రాజా సాబ్’లో వింటేజ్ కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్ అలరించినా.. సాగతీత, వీఎఫ్ఎక్స్ లోపాలు సెకండాఫ్ గ్రాఫ్‌ను పడేశాయనే విమర్శలు వెల్లువెత్తాయి. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హింస, యశ్ ‘టాక్సిక్’లో 194 నిమిషాల భరించలేని రన్‌టైమ్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాయనే అభిప్రాయాలు కామన్ ఆడియన్స్ నుంచి వచ్చాయి. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలకృష్ణ ‘అఖండ 2’, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ చిత్రాలు కూడా సెకండాఫ్‌లో పట్టు తప్పడం వల్లే పూర్తిస్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ‘సెకండాఫ్ ఫెయిల్యూర్’ వెనుక మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మొదటిది ‘ఇంటర్వెల్ హైప్ శాపం’. ఇంటర్వెల్ వరకు కథను పరుగులు పెట్టించి, ఆ తర్వాత ఏం చెప్పాలో తెలియక దర్శకులు తడబడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండోది ‘నిడివి భూతం’. ప్రతి పెద్ద సినిమా దాదాపు 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల పైనే ఉండటంతో, సెకండాఫ్‌లో అనవసరపు సీన్లతో సాగదీస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మూడోది, బలమైన కథ కంటే భారీ సెట్లు, విజువల్ ప్యాకేజింగ్ మీదే ఎక్కువ దృష్టి పెట్టడం. ఇప్పటికైనా మన దర్శకనిర్మాతలు ‘ఇంటర్వెల్ వరకు లాక్కొస్తే చాలు’ అనే భ్రమలోంచి బయటకు రావాలని అంటున్నారు. క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే పక్కా స్క్రీన్‌ప్లేపై దృష్టి పెడితే తప్ప, టాలీవుడ్ పెద్ద సినిమాలకు ఈ ‘సెకండాఫ్ గండం’ తప్పేలా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

