”నాతో కుస్తీకి రెడీనా” అన్నాడు అతడు. ”నా ఇన్సురెన్స్ చెక్ చేసుకుని చెబుతా” అన్నాడు అక్షయ్ కుమార్! ఇంతకీ, ఖిలాడీ కుమార్ ని ‘కుస్తీకి రమ్మంటూ’ ఛాలెంజ్ విసిరిన ఆ ధీరుడు ఎవరంటారా? మరెవరో అయితే అక్షయ్ యుద్ధానికి సిద్ధం అనేవాడే! కానీ, అవతల ‘కొట్టేసుకుందాం రా’ అంటోంది ‘ద అండర్ టేకర్’! అండర్ టేకర్ అంటే రెస్లింగ్ ప్రియులకి బాగా తెలిసిన పేరు. అతను రింగ్ లోకి దిగి పిడి గుద్దులు కురిపిస్తే విధ్వంసమే.అటువంటి భారీ మల్లయోధుడు అక్షయ్ ని ‘దంగల్’కి రమ్మన్నాడు. అక్కీ మాత్రం తెలివిగా ‘ఇన్సురెన్స్ సంగతేంటో చూసుకుని వస్తాను బ్రో’ అంటూ సరదాగా ఆఫర్ ని తోసిపుచ్చాడు. ఇంతకీ, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న అండర్ టేకర్ మన బాలీవుడ్ హీరోని ‘రా… కుస్తీ పడదాం’ అని ఎందుకు అన్నాడు అంటారా? అంతా సొషల్ మీడియా చలవ!
Read Also : రోజు రోజుకూ పెరుగుతున్న ‘లైగర్’ క్రేజ్!
ఇరవై ఏళ్ల కింద అక్షయ్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖిలాడీయోంకా ఖిలాడీ’. ఆ సినిమా రెండు దశాబ్దాల మైలు రాయి దాటటంతో ఈ మధ్య అక్షయ్ ఓ మీమ్ షేర్ చేశాడు. అందులో అండర్ టేకర్ ని ఓడించిన వీరులు అంటూ కొందర్ని చూపించారు. లిస్టులో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. ఎందుకంటే, ‘ఖిలాడియోంకా ఖిలాడీ’ సినిమాలో ఆయన అండర్ టేకర్ ని మట్టి కరిపించే సీన్ ఉంటుంది! కానీ, సినిమాలో కనిపించింది రియల్ అండర్ టేకర్ కాదంటూ ఆ మీమ్ కి వివరణ ఇచ్చాడు కుమార్. తాను కుస్తీ పట్టింది నటుడు బ్రియాన్ లీతో అన్నాడు ఆయన. అండర్ టేకర్ గా ప్రసిద్ధుడైన రెస్లర్ అసలు పేరు ‘మార్క్ కాల్ అవే’! అక్షయ్ కుమార్ వివరణ ఇవ్వటంతో వ్యవహారం ఆగిపోలేదు. సొషల్ మీడియాలో ఆ పోస్టు అలా వైరల్ అవుతూ నిజంగానే మార్క్ కాల్ అవే వద్దకి వెళ్లింది. ఆయన అక్షయ్ పోస్టు చూసి…’ఇప్పుడు రెస్లింగ్ చేద్దాం, వచ్చెయ్!’ అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు! దానికే ఖిలాడీ కుమార్ ‘ఇన్సురెన్స్ చెక్ చేసుకుంటాను’ అనే సమాధానం ఇచ్చాడు! మన బాలీవుడ్ స్టార్ ఫిట్ నెస్ విషయంలో టాప్, పైగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఎన్ని చేసినా ప్రొఫెషనల్ రెస్లర్ తో ‘తన్నులాట’ అంటే మాటలు కాదు కదా! సినిమాలో యాక్షన్, కట్ మధ్య డమ్మీ ఫైటింగ్ అంత ఈజీ కాదు కదా! అందుకే, అండర్ టేకర్ ఆఫర్ ని అక్కీ ‘అబ్బే’ అంటూ సేఫ్ గా రిజెక్ట్ చేశాడు!