తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “ఇష్క్”. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించగా, శ్యామ్ కె నాయుడు సినిటోగ్రాఫర్ గా చేశారు. ఈ చిత్రాన్ని ఇదే నెల 23న విడుదల చేయబోతున్నట్టు ఉగాది సందర్భంగా ప్రకటించారు మేకర్స్. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా సినిమా విడుదల వాయిదా పడింది. కోవిడ్ 19 కేసులలో భయంకరమైన పెరుగుదల కారణంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని… ఏప్రిల్ 23న రావాల్సిన ‘ఇష్క్’ విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ‘ఇష్క్’ నిర్మాతలు. మలయాళంలో విజయం సాధించిన ‘ఇష్క్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తోంది మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ. ప్రస్తుతం కరోనా మహమ్మారి అత్యంత్య వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇష్క్ తో పాటు తెలంగాణ దేవుడు మూవీ కూడా వాయిదా పడింది. ఇక రేపటి నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. సినిమా ప్రదర్శనలను నిలిపి వేయనున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. కొవిడ్ ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్లు, మల్టీ ఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ‘వకీల్ సాబ్’ను మాత్రం థియేటర్లలో మరో రెండు రోజులు ప్రదర్శిస్తారు. ఆ తరువాత శుక్రవారం నుండి థియేటర్లు మూసేస్తారు.