2018లో విడుదలైన డీప్ సీ టెర్రర్ థ్రిల్లర్ మూవీ ‘ద మెగ్’. 75 అడుగుల పొడవైన భయంకరమైన షార్క్ తో ఓ టీమ్ కు ఎదురయ్యే అనూహ్య పరిణామాలే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశం! అప్పట్లో ‘ద మెగ్’ హిట్ టాక్ స్వంతం చేసుకుని భారీగా కలెక్షన్లు కురిపించింది. అయితే, ఒరిజినల్ మూవీ రిలీజ్ తరువాత చాలా మంది సీక్వెల్ ఆశించారు. కానీ, 2020 మొత్తం కరోనాతో కల్లోలంలో గడిచిపోవటంతో ‘ద మెగ్ 2’ ఇంత వరకూ సెట్స్ మీదకు వెళ్లలేదు. కానీ, తమ హిట్ మూవీకి సెకండ్ ఇన్ స్టాల్మెంట్ ఉంటుందని ఇప్పటికే ఫిల్మే మేకర్స్ ప్రకటించారు. రీసెంట్ గా మూవీ హీరో జేసన్ స్టాతమ్ కూడా త్వరలో ‘ద మెగ్ 2’ షూటింగ్ స్టార్ట్ అంటూ సంకేతాలిచ్చాడు. అయితే, ఇప్పుడు 2018 థ్రిల్లర్ మూవీ హీరోయిన్ కూడా కొన్ని వివరాలు బయటపెట్టింది!
‘ద మెగ్’ మూవీలో జేసన్ స్టాతమ్ సరసన ఫీమేల్ లీడ్ గా నటించింది జెస్సికా మెక్ నామీ. ‘మోర్టల్ కాంబాట్’ లాంటి సినిమాలోనూ నటించిన ఈ యాక్షన్ స్టార్ తెర మీద తన స్టంట్స్ తో ఆకట్టుకోవటంలో దిట్ట. ‘ద మెగ్’లోనూ జెస్సికా పాత్ర జనాల్ని బాగా ఆకట్టుకుంది. అయితే, పార్ట్ టూలోనూ తాను నటించబోతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. అంతే కాదు, ‘ద మెగ్ 2’ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేదుగానీ… అతి త్వరలోనే తామంతా సెట్స్ మీదకు వెళతామని ఆమె అంటోంది. జేసన్ స్టాతమ్ తో మళ్లీ కలసి నటించాలని తాను ఉత్సుకతతో ఉన్నట్టు జెస్సికా తెలిపింది. ఇక ‘ద మెగ్ 2’ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుందని కూడా స్టార్ బ్యూటీ రివీల్ చేసింది. ఒకవేళ ఏదైనా మార్పులు జరిగితే న్యూజిలాండ్ తో పాటూ ఆస్ట్రేలియాలోనూ షూటింగ్ ఉంటుందట. అదే జరిగితే తాను లక్కీ అంటోంది జెస్సికా. ఎందుకంటే, ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎవర్నీ లోనికి రానీయటం లేదు. సినిమా షూటింగ్ కోసం తమని అనుమతిస్తే హ్యాపీగా పీలవుతానంది జెస్సికా. ఆమె మాతృదేశం ఆస్ట్రేలియానే కావటం అసలు విశేషం!