తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ పేరు మారిపోతుందా? ఇంతకాలం టైటిల్స్‌లో ‘దళపతి విజయ్’ అని పడేది. మరి ‘జననాయగన్’ సినిమా టైటిల్స్ కార్డులో విజయ్ పేరు మారుతోందనే చర్చ జరుగుతోంది. ‘జననాయగన్’ పోస్ట్‌పోన్ కాకుండా సంక్రాంతికే రిలీజ్ అయి ఉంటే, టైటిల్స్ కార్డులో ‘దళపతి విజయ్’ అనే పడేది. కానీ ఈ ఆరు నెలల్లో విజయ్ తమిళనాడు ఎన్నికల్లో గెలవడం, ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. ఎట్టకేలకు సినిమాను ఈ నెల 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే టైటిల్స్ కార్డులో ‘దళపతి విజయ్’ ని తీసేసి, ‘తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్’ (The Chief Minister of Tamil Nadu C. Joseph Vijay) అని వేస్తున్నారని తెలిసింది. ఒక నటుడి చివరి సినిమాలో, ఆయన సీఎం అయ్యాక ఈ రేంజ్ బిరుదుతో స్క్రీన్ పై పేరు పడటం బహుశా ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇదే తొలిసారి కావచ్చు!
సెన్సార్ ఇబ్బందులు ఫేస్ చేసిన ‘జననాయగన్’.. 12 కట్స్‌తో, ‘ఏ’ (A) సర్టిఫికెట్‌తో విడుదలకు లైన్ క్లియర్ అయింది. విజయ్ రాజకీయ పార్టీ ‘టీవీకే’ (TVK) ప్రస్తావన ఉన్న డైలాగ్స్‌తో పాటు కొన్ని పదాలకు సెన్సార్ బోర్డు మ్యూట్ విధించింది. అయితే ఈ 12 కట్స్ లేకుండా యూకే (UK) లో రిలీజ్ చేసుకునేందుకు అనుమతి లభించడం విశేషం. తెలుగులో హిట్ అయిన ‘భగవంత్ కేసరి’ రీమేక్‌గా ‘జననాయగన్’ రూపొందింది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కథే అయినా, ‘జననాయకుడు’ పేరుతో డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. కాజల్ రోల్‌ను పూజా హెగ్డే, శ్రీలీల రోల్‌ను మమితా బైజు పోషించారు.

