Site icon NTV Telugu

Theater Rental vs. Percentage: థియేటర్ల పంచాయతీ.. సినీ పెద్దలు తేల్చింది ఇదే!

Theaters

Theaters

తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి రెంట్ (అద్దె) విధానం, పర్సంటేజ్ (షేరింగ్) విధానంపై ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య మొదలైన వివాదం అనేక మలుపులు తిరుగుతూ వెళ్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ప్రస్తుతం రెంటల్ విధానంపై ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ విధానంలో నిర్మాతలు థియేటర్లకు నిర్ణీత అద్దె చెల్లించి సినిమాలను ప్రదర్శిస్తారు. అయితే, కలెక్షన్లు తక్కువగా ఉన్నప్పుడు థియేటర్లు షోలను రద్దు చేయడం లేదా మూసివేయడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

Also Read:Kethika Sharma : కేతిక లక్ బాగుంది.. వరుసగా ఆఫర్లు..?

ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానంలో టికెట్ వసూళ్ల ఆధారంగా ఆదాయాన్ని నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య పంచుకుంటారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్, శిరీష్ వంటి ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. అయితే, పర్సంటేజ్ విధానం అమలైతే, పెద్ద బడ్జెట్ సినిమాలకు రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం తెలుగు చిత్ర పరిశ్రమను రెండు వర్గాలుగా విడిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి సంస్థలు ఈ విధానానికి వ్యతిరేకంగా మల్టీప్లెక్స్‌లలో మాత్రమే తమ సినిమాలను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read:Jayam Ravi: నెలకి 40 లక్షల భరణం వార్తలు.. స్టార్ హీరో భార్యకి కౌంటర్

ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన నిర్మాతల సమావేశం పరిశ్రమలో కీలక చర్చలకు కేంద్రబిందువైంది. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ రవి, సితార నాగ వంశీ, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు, వై.వి.యస్. చౌదరి తదితరులు పాల్గొన్నారు. మే 18, 2025న తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ఈ వివాదంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 60 మంది ఎగ్జిబిటర్లతో పాటు ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు. సమావేశంలో నిర్మాతలు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రెండు రోజుల్లో అన్ని సెక్టార్లతో (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) సమగ్ర చర్చలు జరపాలని నిర్ణయించారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని, పరిశ్రమ సామరస్యంగా ముందుకు సాగాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Exit mobile version