Bonda Mani: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు బోండా మణి(60) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. కిడ్నీల సమస్యతో ఏడాదిగా ఇబ్బంది పడుతున్న అయన తన రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో ఏడాది కాలంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి, మణి చెన్నైలోని పోజిచలూరులోని తన నివాసంలో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు క్రోంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షల అనంతరం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక బోండా మణి మృతిని సినీ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై ధృవీకరించాడు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. బోండా మణి మృతదేహాన్ని నివాళులర్పించడం కోసం పోజిచలూరులోని ఆయన నివాసంలో ఉంచారు మరియు అతని అంత్యక్రియలు సాయంత్రం 5 గంటలకు క్రోంపేటలోని శ్మశానవాటికలో జరుగుతాయి. ఆయనకు భార్య మాలతి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇక బోండా మణి 1991లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అలనాటి స్టార్ డైరెక్టర్ భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన పౌను పౌనుతాన్స సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఆయనకు ఎంతో మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. ఆ తరువాత మణికి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. బోండా మణి తన కెరీర్ లో స్టార్ కమెడియన్ వడివేలు కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు చేశారు. దాంతో వడివేలుతో మణి అనుబంధం ఎక్కువగా ఉండేది. పొన్‌విలాంగు, పొంగలో పొంగల్, సుందర ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుధం వంటి అనేక చిత్రాలలో నటించి మెప్పించాడు. ఆయనమృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.