Suriya: స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని చిత్రబృందం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరో సూర్య ఎమోషనల్‌గా మాట్లాడారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ సూర్య కృతజ్ఞతలు తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన సూర్య.. ‘‘మీరు రావడంతో ఈ సాయంత్రం మరింత ప్రత్యేకంగా మారింది. మీ క్లాప్, ఆశీస్సులతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు అందమైన విజయంతో పూర్తయింది’’ అని అన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో తన ప్రయాణం ఎంతో ప్రత్యేకమని, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు కలిసి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ తదితర భాషలకు చెందిన నటీనటులు కలిసి ఈ సినిమా చేయగా.. ప్రేక్షకులు భాషా భేదాలను పక్కన పెట్టి సినిమాను ఆదరించారని అన్నారు. ‘‘మేమంతా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చాం. వేర్వేరు భాషలు మాట్లాడతాం. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఒకే సినిమాగా, ఒకే భావోద్వేగంగా స్వీకరించారు’’ అని పేర్కొన్నారు. ఫ్యామిలీ సినిమాలకు మళ్లీ ఆదరణ రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ‘‘ఈ సినిమా సక్సెస్‌ను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో కొలవలేం. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల మధ్య జరిగే చర్చలు, వారు ఇంటికి తీసుకెళ్లే భావోద్వేగాలు, వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వులు కూడా విజయానికి కొలమానాలే. ఇవన్నీ బ్యాలెన్స్ షీట్‌లో చూపించలేం’’ అని అన్నారు. ఈ సినిమాలో మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చినందుకు వెంకీ అట్లూరిని సూర్య అభినందించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, మమితా బైజు పాత్రలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా రవీనా టాండన్ షూటింగ్ సమయంలో అనారోగ్యంతో ఉన్నప్పటికీ కీలకమైన సన్నివేశం పూర్తయ్యే వరకు టీమ్‌కు సహకరించారని గుర్తుచేసుకున్నారు.
తెలుగు ప్రేక్షకులకు సూర్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదనంగా పలు కేంద్రాల్లో సినిమాకు ఆదరణ లభించిందని చెప్పారు. ‘‘తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను సొంతం చేసుకుని మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అని అన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ సినిమాలు ట్రెండ్‌లో లేకపోయినా.. ఇలాంటి కథను నమ్మి ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని సూర్య పేర్కొన్నారు. అభిమానులు, సినీ ప్రేమికులు, మహిళలు, కుటుంబ ప్రేక్షకులు, మీడియా, రివ్యూవర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ సినిమాను మీ సొంత సినిమాగా భావించి ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అంటూ సూర్య ఎమోషనల్ అయ్యారు.

