Suriya: సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య జరిగే ఆన్‌లైన్ వార్స్‌కు, అనవసర వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటూ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విమర్శించే వారి స్థాయికి దిగజారవద్దని, ఎదుటివారిని మార్చడం అసాధ్యమని స్పష్టం చేస్తూ ఆయన తన అభిమానులకు ఇచ్చిన సందేశం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వైరల్ అవుతోంది. ఇటీవల తన అభిమాన సంఘాల ముఖ్య సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమైన సూర్య, ఆన్‌లైన్ వేదికలపై జరుగుతున్న పరిణామాలపై నేరుగా స్పందించారు. “సోషల్ మీడియాలో ఎవరో ఏదో పోస్ట్ చేశారని లేదా ట్రోల్ చేశారని మనం కూడా తిరిగి స్పందిస్తే.. మనకీ వాళ్లకీ తేడా లేకుండా పోతుంది. ఎదుటివాళ్లను మార్చడం మన వల్ల కాదు, అది చాలా కష్టం. విమర్శలు చేసేవారికి సమాధానాలు చెబుతూ మీ సమయాన్ని, అమూల్యమైన శక్తిని వృథా చేసుకోకండి. వాళ్లను వాళ్లలాగే వదిలేద్దాం.. మనం మాత్రం ప్రేమను మాత్రమే పంచుదాం. ప్రతిరోజూ మీరు చేసే పని, మీ లక్ష్యాలపైనే దృష్టి పెట్టండి, కచ్చితంగా విజయాలు దక్కుతాయి” అంటూ ఫ్యాన్స్‌కి దిశానిర్దేశం చేశారు.
సూర్య ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో జరిగిన పరిణామాలే ఈ కామెంట్స్ వెనుక ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. హీరో శివకార్తికేయన్ ‘సర్దార్ 2’, ‘మండాడి’ చిత్ర బృందాలను అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు ఇరువర్గాల ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలకు, ట్రోలింగ్‌కు దారితీశాయి. నెట్టింట పరస్పరం దూషించుకునే స్థాయికి చేరిన ఈ వ్యవహారంపైనే సూర్య చాలా హుందాగా, సున్నితంగా స్పందించి వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సూర్య కెరీర్ పరంగా తిరుగులేని దూకుడును ప్రదర్శిస్తున్నారు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలతో వరుసగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. తాజాగా మలయాళ స్టార్ డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఆయన తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సీన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ దీపావళి కానుకగా నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఒకవైపు సినిమాలతో బాక్సాఫీస్‌ను దున్నేస్తూనే, మరోవైపు ఫ్యాన్స్‌కు మార్గదర్శకంగా నిలుస్తూ సూర్య తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

