వేసవి సెలవులు అనగానే ప్రతి ఒక్కరికీ తమ బాల్యమే గుర్తుకొస్తుంది. అమ్మమ్మ ఊరు, తాతయ్యల గారాబం, స్నేహితులతో ఆటలు.. ఆ తీపి జ్ఞాపకాలను మళ్ళీ కళ్లముందు ఉంచుతూ ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ఫీల్‌గుడ్ చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ నోస్టాల్జిక్ బ్లాక్‌బస్టర్, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (SonyLIV)లో డిసెంబర్ 4వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. కేవలం తెలుగులోనే కాకుండా.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ ఇలా ఏకంగా ఐదు భాషల్లో ‘సమ్మర్ హాలీడేస్’ స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్‌కు, ఇతర భాషల సినీ ప్రియులకు ఇది నిజంగా పెద్ద శుభవార్తనే చెప్పాలి.
శ్రీకర్ నయన్ దర్శకుడిగా తన తొలి సినిమాతోనే అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు. గోదావరి ప్రాంతంలోని ఒక అందమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ కథను ఎంతో హృద్యంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ నుంచి వేసవి సెలవులకు తన అమ్మమ్మ (సహజనటి జయసుధ) ఊరికి వెళ్లే ఆర్.వి (అరుణ్ దేవ్) అనే కుర్రాడితో కథ మొదలవుతుంది. అక్కడ ఆర్థిక ఇబ్బందులతో పోరాడే కె.వి (రోహన్ రాయ్) అనే మరో బాలుడితో అతనికి ఊహించని స్నేహం ఏర్పడుతుంది. రెండు పూర్తిగా భిన్నమైన ప్రపంచాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లల మధ్య చిగురించిన స్నేహం, ఒక సాధారణ వేసవి సెలవును అసాధారణ ప్రయాణంగా ఎలా మార్చింది అన్నదే ఈ సినిమా అసలు ఆత్మ. తరగతి గది పాఠాలకు అతీతంగా.. నవ్వులు, చిన్నచిన్న సాహసాలు, మానవ సంబంధాలలోని ఆత్మీయతను ఈ చిత్రం ఎంతో సున్నితంగా ఆవిష్కరించింది. జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకాలన్నీ అత్యంత సాధారణ క్షణాల నుంచే పుడతాయని గుర్తుచేసే ‘సమ్మర్ హాలీడేస్’, ఈ డిసెంబర్ 4 నుంచి సోనీ లివ్‌లో కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

