ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ‘గీతాంజలి’ మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత ‘జయమ్ము నిశ్చయంబురా’ చిత్రంలోనూ హీరోగా నటించాడు. మొదటి సినిమాలో అంజలి నాయిక కాగా, రెండో సినిమాలో పూర్ణ హీరోయిన్ గా చేసింది. తాజాగా శ్రీనివాస రెడ్డి హీరోగా నటించిన మరో సినిమా ‘ముగ్గురు మొనగాళ్ళు’ ఈ నెల 6న విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే… ఈ మూడు సినిమాల పేర్లతోనూ గతంలో చిత్రాలు వచ్చాయి. ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాను అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేశారు. శ్రీనివాసరెడ్డితో పాటు ఈ మూవీలో దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు కీలకపాత్రలు పోషించారు. దీనిని అచ్యుత్ రామారావు నిర్మించారు.
ఇదిలా ఉంటే… ఆగస్ట్ 20వ తేదీన శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ప్లాన్ బి’ విడుదల కాబోతోంది. ఇందులో సూర్య వశిష్ఠ, మురళీశర్మ, రవిప్రకాశ్, అభినవ్ సర్దార్, నవీనారెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు జరుపుకున్న ఈచిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించిందని, ఈ మూవీ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని దర్శకుడు కె.వి. రాజమహి, నిర్మాత ఏవీఆర్ తెలిపారు. మరి కేవలం రెండు వారాల గ్యాప్ తో వస్తున్న శ్రీనివాసరెడ్డి చిత్రాలు ‘ముగ్గురు మొనగాళ్ళు, ప్లాన్ బి’కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.
