Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”

Cinema

Cinema

Srikanth Odela: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే టాలీవుడ్‌లో గంభీరమైన వ్యక్తిత్వం, కఠినమైన క్రమశిక్షణే గుర్తొస్తాయి. ఆయన సెట్లోకి వస్తున్నారంటే దర్శకుల నుంచి సాధారణ సిబ్బంది దాకా ఒకింత భయంతో కూడిన జాగ్రత్త పాటిస్తుంటారు. అయితే ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవంపై యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పంచుకున్న ముచ్చట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. “మోహన్ బాబు గారు హిట్లర్ లాంటి వారని భయపెట్టారు.. కానీ తీరా సెట్లో చూస్తే చిన్న పిల్లోడిలా కనిపించి షాకిచ్చారు” అంటూ శ్రీకాంత్ ఓదెల చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికపై మోహన్ బాబుతో తన మొదటి అనుభవాన్ని శ్రీకాంత్ వివరిస్తూ.. “నేను మోహన్ బాబు గారిని కలవడానికి వెళ్లే ముందు ఇండస్ట్రీలో చాలామంది నన్ను హెచ్చరించారు. ఆయన హిట్లర్ లాంటి వారు, ఎవరి మాటా వినరు, నువ్వు చెప్పింది అస్సలు చేయరు, ఆయనతో మాట్లాడటం చాలా కష్టం అని భయపెట్టారు. కానీ తిరుపతిలో తొలిసారి ఆయనను కలిసిన క్షణంలోనే ఆ భావనలన్నీ పటాపంచలయ్యాయి. నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఏ దర్శకుడూ మాట్లాడలేనంత చనువుతో నేను అనుకున్నది అనుకున్నట్లు ఆయనతో నేరుగా చెప్పగలిగాను” అని పేర్కొన్నారు. బయట ఉన్న ప్రచారానికి, సెట్లో మోహన్ బాబు ప్రవర్తనకు అసలు సంబంధమే లేదని అన్నారు.

“సెట్లో ఆయన ఒక ఎల్కేజీ పిల్లాడి మైండ్‌సెట్‌తో ఉంటారు. మేమే ఇంకా కుర్రాళ్లం అనుకుంటే, మాకంటే చిన్న పిల్లోడిలా సరదాగా కలిసిపోతారు. ఆయన ఎనర్జీని చూసి మా డైరెక్షన్ టీమ్ మొత్తం ఆశ్చర్యపోయేవాళ్లం. సాధారణంగా ప్రతి టెక్నీషియన్‌కు అవార్డులు రావాలని ఉంటుంది. కానీ ‘ది ప్యారడైజ్’కు ఎలాంటి రిజల్ట్ వచ్చినా, మోహన్ బాబు గారితో కలిసి పనిచేయడం నా జీవితంలో దక్కిన అతిపెద్ద లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్. ఆయన నుంచి ప్లానింగ్, పనితీరు విషయంలో ఎన్నో అమూల్యమైన విషయాలు నేర్చుకున్నాను” అని శ్రీకాంత్ భావోద్వేగంగా వెల్లడించారు. హీరోయిన్ కయాదు లోహర్ పోషించిన పాత్రను మొదట చాలామంది టాప్ హీరోయిన్లు రిజెక్ట్ చేశారని, బోల్డ్ క్యారెక్టర్ కావడంతో స్కిన్ షో ఎక్కువ ఉంటుందేమోనని కయాదు కూడా తొలుత సందేహించిందని, కానీ కథకు తగిన హుందాతనంతోనే తెరకెక్కించామని స్పష్టం చేశారు. అలాగే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు ‘బిర్యానీ’ పాత్ర ఇవ్వడంపై టీమ్‌లో అనుమానాలు ఉన్నా, తన నమ్మకాన్ని నిజం చేస్తూ సంపూ అద్భుతంగా నటించారని కొనియాడారు. హీరో నానితో ఎన్ని క్రియేటివ్ విభేదాలు వచ్చినా ఆయన నన్ను భరించాల్సిందేనని, తమ బంధం సినిమాలకు అతీతమైనదని చెప్పిన శ్రీకాంత్ ఓదెల.. మోహన్ బాబు వంటి సీనియర్ లెజెండ్‌పై చేసిన ఈ రా అండ్ జెన్యూన్ కామెంట్స్ ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.