Srikanth Odela: తెలుగు సినిమాలో హీరోయిజం అంటే కేవలం హీరో యాక్షన్, కండలు తిరిగిన వీరుల ఫైట్లు మాత్రమే కాదని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరోసారి నిరూపించారు. ‘దసరా’లో వెన్నెల పాత్రతో ఒక బలమైన ముద్ర వేసిన ఆయన, ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మహిళా పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై నానితో స్పెషల్ ఇంటర్వ్యూలో ఇచ్చిన వివరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. తాము ప్రేమించిన వారి కోసం స్త్రీలు ఎంతటి తీవ్రమైన నిర్ణయాలైనా తీసుకుంటారని, వారి మానసిక శక్తి ముందు ఏ మగాడూ నిలబడలేడంటూ శ్రీకాంత్ చెప్పిన మాటలు సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. సమాజంలో సాధారణంగా కనిపించే ఒక పురుషాధిక్య భావజాలాన్ని బద్దలు కొడుతూ శ్రీకాంత్ మాట్లాడారు.
“మగాడు వెళ్లినంత ఎక్స్‌ట్రీమ్‌కు ఆడోళ్లు వెళ్లలేరని మన సమాజంలో ఒక సాధారణ అభిప్రాయం ఉంటుంది. కానీ నా అబ్జర్వేషన్ వేరు. ఆడవాళ్లు తాము ప్రేమించిన వారి కోసం ఒక ఎక్స్‌ట్రీమ్ డెసిషన్ తీసుకుంటే.. ఈ ప్రపంచంలో ఉన్న ఏ మగాడూ దాన్ని తట్టుకోలేడు, ఊహకు కూడా అందని రీతిలో వాళ్ల చర్యలు ఉంటాయి” అని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు. ఆడవాళ్లు తమ వ్యక్తిగత ఓటమిని, అవమానాలను సైలెంట్‌గా భరిస్తారని, కానీ తమ తండ్రినో, కొడుకునో, భర్తనో, సోదరుడినో ఎవరైనా కించపరిస్తే మాత్రం కట్టలు తెంచుకుంటారని తన పాత్రల ద్వారా విశ్లేషించారు. ప్యారడైజ్ చిత్రంలోని పాత్రల ఔచిత్యాన్ని వివరిస్తూ శ్రీకాంత్ రెండు ప్రధాన పాత్రల భావోద్వేగాలను బయటపెట్టారు. ఈ సినిమాలో సుబ్బు పాత్ర ఇంట్లో తిండికి లేకపోయినా, కెరీర్‌లో ఓడిపోయి చనిపోవాలనుకున్న దశలో ఉన్న ఒక అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పారు. తన తండ్రిని ఎవరో అవమానించారనే ఒక్క కారణంతో ఆమె తిరిగి నిలబడుతుందని, అవమానించిన వాడేతోనే తన తండ్రికి సలాం కొట్టించేలాచేస్తానని ఒంటిచేత్తో నిలబడే దృఢత్వం ఆమె శక్తికి నిదర్శనమని చెప్పారు. “నీకు కొడుకు పుడితే వాడు పారిపోయేవాడేమో నాన్నా, కానీ కూతురిగా నేను నిలిచి నీ బాకీలన్నీ తీర్చాను” అనే ఒక డైలాగ్‌తో ఆమె స్థాయిని ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓదెల పెంచారు.
నాని తల్లి పాత్ర గురించి మాట్లాడుతూ.. కరెంట్ షాకులు పెట్టినా, సారాయి బట్టీలో చిత్రహింసలు పెట్టినా తట్టుకుని నిలబడే ఒక తల్లి.. ఆకలితో అలమటిస్తున్న, చావుబతుకుల మధ్య ఉన్న తన బిడ్డను కాపాడుకోవడానికి ఎలాంటి అత్యంత కఠినమైన నిర్ణయానికైనా వెనుకాడదని నిరూపించిందన్నారు. అక్కడ ఆమె చూపించే ధైర్యం సమాజపు చట్రాలను దాటిపోతుందని చెప్పారు. ఈ సినిమాకు సమాంతరంగా ఉండే ఆత్మ ‘సమ్మక్క’ అని నాని కూడా అంగీకరించారు. తమ వారిని కాపాడుకోవడానికి స్త్రీ ఎంచుకునే బాటలు సమాజానికి ఒక్కోసారి షాకింగ్‌గా అనిపించవచ్చు, కానీ ఆ ప్రేమ, ఆ త్యాగం తాలూకు లోతు కొలవలేనిదని శ్రీకాంత్ స్పష్టం చేశారు. కేవలం గ్లామర్ కోసమో, పాటల కోసమో స్త్రీ పాత్రలను వాడుకోకుండా.. రా అండ్ రస్టిక్ కథలో స్త్రీల మానసిక బలాన్ని, వారు తెగించే హద్దులను ఇంతటి తీవ్రతతో తెరపై ఆవిష్కరించడం శ్రీకాంత్ ఓదెల ప్రతిభకు నిదర్శనం అనే కామెంట్స్ నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. నార్మల్ ఆడియన్స్‌కు ఇది అర్థం కావడానికి కాస్త టైం పట్టినా, ఆయన ఇచ్చిన ఈ ఎక్స్‌ప్లనేషన్ సినిమాలోని విమెన్ పవర్‌కు ఒక కొత్త అర్థాన్ని ఇచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

