ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంటే… హాలీవుడ్ నిర్మాణ సంస్థలు మాత్రం తమ కొత్త చిత్రాల విడుదల తేదీలను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఆ రకంగా వరల్డ్ సూపర్ హీరో డే రోజున ‘బ్లాక్ విడో’ రిలీజ్ డేట ను వాల్ట్ డిస్నీ సంస్థ ప్రకటించింది. క్రేజీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘బ్లాక్ విడో’ జూలై 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రాబోన్నట్టు తెలిపింది. అదే విధంగా దీనిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ అదనంగా రుసుము చెల్లించి చూసే సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నాయిక స్కార్లెట్ జోహన్సన్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా ‘అవెంజర్స్’ రేజ్ విజువల్ ట్రీట్ తో ప్రేక్షకులను అలరించబోతోందని ఆ మధ్య వచ్చిన ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. దానికి తోడు ఏప్రిల్ 28న కూడా కొన్ని యాక్షన్ సీన్స్ వీడియోను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ‘బ్లాక్ విడో’ సీరిస్ లో మొత్తం నాలుగు చిత్రాలను నిర్మించాలన్నది వాల్ట్ డిస్నీ ఆలోచన. అందులో మొదటిది జులై 9న రాబోతోంది. కేట్ షార్ట్ దర్శకత్వం వహించిన ఈ తొలి భాగంలో నటాషా రోమనోస్ అలియాస్ ‘బ్లాక్ విడో’ గతం ఏమిటీ? ఆమె గూఢచర్యం వెనుక దాగి ఉన్న కథ ఏమిటీ? అనేది చూపించబోతున్నారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలలో ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ అలెక్సీ, రాచెల్ విజ్ కనిపించబోతున్నారు. జులై 9 నాటికి కరోనా సద్దుమణిగి మామూలు రోజులు వస్తే మంచిదే! లేకపోతే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ ‘బ్లాక్ విడో’ మరోసారి పోస్ట్ పోన్ కావచ్చు.