బాబూ మోహన్ తెరపై కనిపిస్తే చాలు, ప్రేక్షకుల్లో నవ్వులు విరిసేవి. బాబూ మోహన్ తమ చిత్రాల్లో ఉంటే చాలు జనం థియేటర్లకు రావడం ఖాయం అన్నంతగా నిర్మాతలు భావించేవారు. బాబూమోహన్ హవా ఆ రోజుల్లో విశేషంగా వీచింది. ఎంతలా అంటే ఆయనపై స్పెషల్ సాంగ్స్ తీసేంతగా. అందాల తార సౌందర్య సైతం బాబూ మోహన్ తో కలసి “చినుకు చినుకు అందెలతో…” అంటూ చిందేసి కనువిందు చేసిందంటేనే ఆయన హవా ఏ స్థాయిలో వీచిందో అర్థం చేసుకోవచ్చు. 1990లలో బాబూ మోహన్ తెలుగు సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ లో ఒకరిగా వెలిగారు. అప్పట్లో ఆయన నవ్వులు లేని సినిమాలు అరుదుగా కనిపించేవి.
కోడి పట్టేసిన నవ్వుల పకోడి!
నాటకరంగంలో ఆరితేరిన బాబూమోహన్ కన్ను తొలి నుంచీ సినిమా రంగంపైనే ఉండేది. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న బాబూ మోహన్ కు కోడి రామకృష్ణ చిత్రాలు దైవప్రసాదంలా కనిపించాయి. తొలుత కోడి రామకృష్ణ సినిమాలతో గుర్తింపు సంపాదించిన బాబూమోహన్ ఆ తరువాత అనేకమంది దర్శకులకు నచ్చాడు. దాంతో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికే గుడ్ బై చెప్పి చిత్రసీమలో స్థిరపడిపోయారు. బాబూమోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. వారిద్దరూ నటించిన పలు చిత్రాలు విజయపథంలో పరుగులు తీశాయి. తన సహ హాస్యనటులందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండేవారు బాబూ మోహన్. నటరత్న యన్టీఆర్ అంటే బాబూ మోహన్ కు అమితాభిమానం. యన్టీఆర్ చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’లో ఆయనతో కలసి ఓ సీన్ లో నటించే ఛాన్స్ దక్కినందుకే పులకించిపోయారు బాబూమోహన్. తరువాత యన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి, మెదక్ జిల్లా ఆందోళ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కార్మికశాఖ మంత్రిగానూ పనిచేశారు. అదే నియోజకవర్గంలో రెండు సార్లు ఓటమి చవిచూసిన బాబూమోహన్ 2014లో అక్కడ నుంచే టీఆర్ఎస్ పార్టీ తరపున శాసనసభకు ఎంపికయ్యారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు బాబూ మోహన్.