మనిషి నిత్యవిద్యార్థిగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. చిన్నతనంలో చదువుకోని వారు సైతం చదువు నేర్చుకోవడానికి ప్రభుత్వం ‘వయోజన విద్య’ను కూడా నెలకొల్పింది. మరిన్ని పై చదువులు చదవాలని తపించేవారికి ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచారు. యాభై, అరవై, డెబ్బై ఏళ్ళు పైబడ్డాక కూడా చదువుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు కొందరు విద్యాభిలాషులు. అలా వయసు పైబడ్డ వారిలోనూ చదువుపై తపన పెంచేలా కథ రూపొందించి, ‘కాలేజీ బుల్లోడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజజీవితంలో ఏడో తరగతివరకే చదువుకున్న నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తరువాత నటునిగా రాణించి, కృషితో ఇంగ్లిష్ లో మంచి పట్టు సాధించి, చలనచిత్రసీమలో తరిగిపోని, చెరిగిపోని స్థానం సంపాదించారు. దాంతో ఆయనే హీరోగా ‘కాలేజీ బుల్లోడు’ సినిమాను తెరకెక్కించడం మరింత విశేషం! శరత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కాట్రగడ్డ ప్రసాద్ నిర్మాణసారథ్యంలో వెలుగు చూసింది. 1992 జూలై 2న ‘కాలేజీ బుల్లోడు’ చిత్రం జనం ముందు నిలచింది, భలేగా అలరించింది.

‘కాలేజీ బుల్లోడు’ కథ విషయానికి వస్తే – పెద్దగా చదువు లేకపోయినా, గోపాలకృష్ణ స్వయంకృషితో ఇండస్ట్రియలిస్ట్ గా ఎదుగుతాడు. ఆయన కొడుకు రాజా మాత్రం అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. గోపాలకృష్ణకు వ్యాపారంలో పోటీదారు అయిన కోటేశ్వరరావు మాత్రం చదువులేని వాడని గోపాలకృష్ణను చులకనగా చూస్తూ ఉంటాడు. దాంతో పట్టుదలతో చదివి, కాలేజీ స్థాయికి చేరుకొని కొడుకుతో పాటు కాలేజ్ కు వెళతాడు గోపాలకృష్ణ. ఓ వైపు తాను చదువుకుంటూనే కొడుకును దారిలో పెడతాడాయన. అలాగే తనకు విద్యను బోధించే అధ్యాపకుల జీవితాల్లోనూ వెలుగు నింపుతాడు. ఇంగ్లిష్ టీచర్ సరస్వతి కుటుంబం బాగు పడేలా చూస్తాడు. కోటేశ్వరరావు కూతురు, గోపాలకృష్ణ కొడుకు ప్రేమించుకుంటారు. గోపాలకృష్ణను ఎలాగైనా అవమానాల పాలు చేయాలని తపిస్తాడు కోటేశ్వరరావు. చివరకు అతని కంపెనీలో పనిచేసే కార్మికులు, కన్న కూతురు కూడా గోపాలకృష్ణ మంచితనాన్ని కొనియాడతారు. దాంతో కోటేశ్వరరావు తన తప్పు తెలుసుకొని, గోపాలకృష్ణను మన్నించమంటాడు. ఆయన ఈయనను సాదరంగా ఆహ్వానిస్తాడు. చివరకు గోపాలకృష్ణ మంచి మార్కులతో పట్టా పుచ్చుకుంటాడు. నాలాగా చదువుకోవాలని ఆశించేవారికి ప్రభుత్వమే ‘అక్షరజ్యోతి’ పథకం ఏర్పాటు చేసిందని, ఆ పథకానికి తన వంతుగా కోటి రూపాయల విరాళం సమర్పిస్తున్నానని గోపాలకృష్ణ ప్రకటించడంతో కథ ముగుస్తుంది.

పి.బలరామ్ నిర్మించిన ఈ చిత్రంలో రాధిక, హరీశ్, సత్యనారాయణ, రాజ్ కుమార్, యమున, జీనత్, బ్రహ్మానందం, బాబూమోహన్, తనికెళ్ళ భరణి, నర్రా వెంకటేశ్వరరావు, సారథి, వై.విజయ, అత్తిలి లక్ష్మి, కల్పనా రాయ్, డిస్కో శాంతి తదితరులు నటించారు. బి.వెంకట్రామ్ రాసిన కథకు సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు. భమిడిపాటి రాధాకృష్ణ స్క్రీన్ ప్లే అందించారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు పలికించగా, రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. “అందమా… ఇలా అందుమా…”, “ఎంతో మధురమీ జీవితం…”, “ర్యాగింగ్ ఆట…”, “ఏమి హాయిలే…” అంటూ సాగే పాటలు అలరించాయి. ‘కాలేజీ బుల్లోడు’ సినిమా మంచి ఆదరణ పొందింది.


